మాంటిస్సోరి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
పూల పండుగతో మురిసిన మాంటిస్సోరి చిన్నారులు




సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
పట్టణంలోని మాంటిస్సోరి హైస్కూల్‌లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో పాఠశాలకు వచ్చారు. చిన్నారుల సందడితో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అబ్దుల్ మన్నన్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే ఈ పూల పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందన్నారు. ఇలాంటి వేడుకలను పాఠశాలల్లో నిర్వహించడం ద్వారా చిన్నారులకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు.
బతుకమ్మ పండుగ వెనుక ఉన్న చారిత్రక విశిష్టతను, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని విద్యార్థినులకు వివరించారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చడం ప్రకృతి అందాలకు ప్రతీకగా నిలుస్తుందని, పూల పండుగ ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తుందని చెప్పారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే తెలంగాణ పండుగల విశిష్టతను తెలుసుకొని, సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు షాజు థామస్, కె. రవీందర్, ప్రిన్సిపల్ అబ్దుల్ మన్నన్, ఏహెచ్‌ఎం సునీల కుమారి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


