హామీల అమలుకు బీఆర్‌ఎస్ సమరభేరి
హుస్నాబాద్‌లో రైతు సదస్సు, వంటావార్పు
సిద్దిపేట టైమ్స్ డెస్క్:

ఎన్నికల సమయంలో ఇచ్చి భ్రమలు కల్పించిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా వంచించిందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం హుస్నాబాద్ మండలం పందిళ్ల స్టేజి వద్ద భారీ రైతు సదస్సు, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన సభకు కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
హామీలు అమలుచేసే వరకు పోరాటం: వినోద్ కుమార్
420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వినోద్ కుమార్ మండిపడ్డారు. రైతుబంధు, రైతుభరోసా, పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు మరియు విత్తనాలు అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను గ్రామా గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ను నిలదీస్తామని హెచ్చరించారు.
రైతుల ఆగ్రహానికి మూల్యం చెల్లించక తప్పదు: సతీష్ కుమార్
మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ, గౌరవెల్లి ప్రాజెక్టు పనులు 99 శాతం పూర్తయినప్పటికీ, మిగిలిన స్వల్ప పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మహిళలకు నెలకు ₹2,500, కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, ఉచిత స్కూటీల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర, సాగునీరు, పెట్టుబడి సాయం అందించే వరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్‌తో పాటు ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్, చిగురుమామిడి, కోహెడ, అక్కన్నపేట మండలాలకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



