కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం
జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, నవంబర్ 23:
బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కడెం లింగమూర్తి హితవు పలికారు. ఈ నెల 19న సిద్దిపేట జిల్లా కేంద్రంలో సీఎం బహిరంగ సభలో ప్రమాదవశాత్తు మృతి చెందిన హుస్నాబాద్ మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన మహిళా సంఘం సభ్యురాలు కొమ్ము సారవ్వ మృతి చెందడంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి లో జరిగిన బహిరంగ సభలో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు మృతి చెందారని గుర్తుచేశారు. ఎల్కతుర్తి సభ నేపథ్యంలో మృతి చెందిన వారికి కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా సాయం అందించారా అని ప్రశ్నించారు.
అనుకోని ప్రమాదాలు, సంఘటనలు పట్ల సానుకూలంగా స్పందించాలని, తప్పుడు కక్షపూరితంగా మాట్లాడడం సబబు కాదన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబానికి వెళ్లి బాసటగా నిలిచారని తెలిపారు. నవంబర్ 20న ఉదయం ప్రభుత్వం ఆసుపత్రికి వెళ్లి రూ.5 లక్షల తక్షణ ఆర్థిక సాయం అందించిందని చెప్పారు. అలానే ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సాయం అందిస్తామని, మహిళా సంఘాల నుంచి మృతురాలి కుటుంబానికి అందాల్సిన పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రజాప్రతినిధులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే బీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.




