అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
ప్రభుత్వ తీరుపై కౌన్సిలర్ గాదెపాక రవీందర్ విమర్శలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గాదెపాక రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపైనా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపైనా అధికారులతో లెక్కలు తీయించి ప్రజల ముందు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలనే అభివృద్ధి చేశారని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఆ మూడు నియోజకవర్గాల్లో సభలు పెట్టి బీఆర్ఎస్‌ను ఓడిస్తామని చెప్పడం సరికాదని రవీందర్ అన్నారు. అభివృద్ధిని చూసిన ప్రజలు వారిని ఏ విధంగా ఓడిస్తారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ ఇంకా చాలా కుటుంబాలకు అందడం లేదని, మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం హామీల ఊసే లేదని విమర్శించారు. రైతులకు రూ. 5 లక్షల రైతు బీమాను అందించలేకపోయారని అన్నారు.
పెన్షన్లు రెట్టింపు చేస్తామని చెప్పి మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయలేదని, అర్హులైన వృద్ధులు, చేనేత కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని రవీందర్ పేర్కొన్నారు. మంజూరైన పెన్షన్ల పంపిణీని కూడా 19వ తేదీ నుంచి 26వ తేదీకి వాయిదా వేశారని, ప్రభుత్వం వద్ద బడ్జెట్ ఉంటే ఈ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టి, పాత పనులకే ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం అగ్ర నాయకులను విమర్శించడానికే పరిమితం కాకుండా, శంకుస్థాపన చేసిన పనులను పూర్తి చేసి, ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు.
Posted inతాజావార్తలు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ హుస్నాబాద్
అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి



