46 ఏళ్ల నాటి బాల్య స్మృతులకు ఆత్మీయ సమ్మేళనం
నవ్వులు, కబుర్లు, ఆటపాటలతో సందడిగా పూర్వ విద్యార్థుల కలయిక
హుస్నాబాద్:
పాఠశాల ప్రాంగణంలో కలిసి చదువుకున్న నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ హుస్నాబాద్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకున్నారు. 46 ఏళ్ల నాటి బాల్య స్నేహాలను గుర్తుచేసుకుంటూ నిర్వహించిన రెండో ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని ‘మన ఫామ్‌హౌస్’లో రోజంతా ఉత్సాహంగా సాగింది. ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తమ పాఠశాల రోజుల అనుభవాలు, ఉద్యోగ, కుటుంబ జీవిత విశేషాలు, బాధ్యతలు, అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. గతంలో నిర్వహించిన తొలి సమ్మేళనం నుంచి నేటి వరకు దూరమైన మిత్రులను, కీర్తిశేషులైన గురువులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
హుస్నాబాద్ జూనియర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్, పూర్వ విద్యార్థి రామచంద్రారెడ్డి ఈ సమ్మేళనం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు నరేందర్, గంగం సుజాత, గంగం జితేందర్ రెడ్డి, క్యాస శ్రీనివాస్, అన్నవరం సుజాత, చిత్తారి హన్మయ్య, చీకోటి శ్రీనివాస్ తదితరులు ఆర్థికంగా, ఇతర రూపాల్లో సహకారం అందించారు. మధ్యాహ్న భోజనం అనంతరం నాటి సెల్ఫ్ గవర్నమెంట్ డే కార్యక్రమ ప్రధానోపాధ్యాయుడు వడ్డేపల్లి బాలయ్య నేతృత్వంలో పలు వినోద కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మానాన్నలపై కవితలు, మినీ కథలు, చలోక్తులు, నచ్చిన పుస్తకాలు, పాఠశాల అనుభవాలు వంటి అంశాలతో మిత్రులు తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
తొలి సమ్మేళనం నుంచి ఇప్పటివరకు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. సమ్మేళనానికి అంకురార్పణ చేసినవారితో పాటు ఆర్థిక సహకారం అందించిన మిత్రులను అభినందించారు. చివరగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరినీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు. మిత్రులంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి సంవత్సరం ప్రత్యక్షంగా కలుసుకోవడంతో పాటు వాట్సాప్ ద్వారా స్నేహబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆనందోత్సాహాల మధ్య సాయంత్రం ఆరు గంటలకు సమ్మేళనం ముగిసింది.



