సభకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు..!
బస్సుల మధ్య ఇరుక్కుని నాగారం మహిళ మృతి
బాధిత కుటుంబానికి మంత్రి పొన్నం పరామర్శ.. రూ.5 లక్షల ఆర్థిక సాయం
మరో రూ.10 లక్షల ప్రమాద బీమా అందేలా చర్యలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సీఎం సభకు వెళ్లి వస్తూ ఓ మహిళ ప్రమాదానికి గురై మృత్యువాత పడిన ఘటన విషాదాన్ని నింపింది. సిద్దిపేటలో గురువారం నిర్వహించిన సీఎం సభకు హాజరై తిరిగి బస్సు ఎక్కేందుకు వెళ్తున్న క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుని హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాద వార్త తెలుసుకున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో సారవ్వ పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమావతి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
రూ.15 లక్షల వరకు ఆర్థిక భరోసా
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. సారవ్వ మహిళా సంఘం సభ్యురాలు కావడంతో మహిళా సంఘం ద్వారా వర్తించే రూ.10 లక్షల ప్రమాద బీమా కూడా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే సారవ్వకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కడు పేదరికంలో జీవిస్తున్న ఆమె ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాగారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.




