రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి..
ఓటీఆర్‌కు టెస్ట్ మిల్లింగ్ నిర్వహించాలి..
పది రోజులుగా సమ్మె.. తహసీల్దార్‌కు వినతి
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హుస్నాబాద్, అక్కన్నపేట రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిల్లర్లు పది రోజులుగా సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఒక క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల బియ్యం రావాలనే నిబంధనను పునఃపరిశీలించి టెస్ట్ మిల్లింగ్ నిర్వహించాలని కోరారు. ఎఫ్‌సీఐ నిబంధనలను కొంత సడలించాలని, నాణ్యత ప్రమాణాలకు అనుగుణమైన ధాన్యం నాణ్యత కలిగిన ధాన్యాన్ని సరఫరా చేయాలని కోరారు. ధాన్యం నాణ్యత ఆధారంగా బియ్యం దిగుబడి నిష్పత్తిని నిర్ణయించాలని తెలిపారు. ఓటీఆర్ ను ఖరీఫ్, రబీ సీజన్లకు వేర్వేరుగా టెస్ట్ మిల్లింగ్ ఆధారంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. క్వింటాలుకు ప్రస్తుతం ఇస్తున్న మిల్లింగ్ ఛార్జీని రూ.10 నుంచి రూ.150కు పెంచాలని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఛార్జీలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పౌరసరఫరాల శాఖ కు సంబంధించిన పెండింగ్ మిల్లింగ్, రవాణా, డ్రయేజీ, కస్టోడియన్ ఛార్జీలు చెల్లించాలని, 25 శాతం జరిమానా, 12 శాతం వడ్డీని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పాత గన్నీ సంచుల ధరను రూ.11గా నిర్ణయించాలని కోరారు. రైస్ మిల్లులను వ్యవసాయ అనుబంధ పరిశ్రమలుగా గుర్తించి తక్కువ వోల్టేజీ విద్యుత్ సరఫరా కేటగిరీలో 200 హెచ్‌పీ వరకు విద్యుత్ అందించాలని కోరారు. 2022–23 రబీ టెండర్ ధాన్యానికి న్యాయమైన ధర నిర్ణయించాలని, సీఎంఆర్ ఒప్పందాన్ని మిల్లర్లకు ఆమోదయోగ్యంగా రూపొందించాలని కోరారు. రబీ ధాన్యం అధిక ఉష్ణోగ్రతలో రావడంతో హెడ్‌రైస్ దిగుబడి తగ్గుతోందని పేర్కొన్నారు. మరపట్టే సమయంలో వచ్చే సహజ నష్టాలను కొరతగా పరిగణించకుండా నిబంధనల్లో గుర్తించాలని కోరారు.
గతంలో కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ, మైసూరు నిర్వహించిన టెస్ట్ మిల్లింగ్ ఫలితాలను విడుదల చేసి, వాటి ఆధారంగా ఓటీఆర్ నిర్ణయించాలని కోరారు. ప్రభుత్వ ధాన్యంతో తయారయ్యే ఉడికించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించేందుకు అవసరమైన నిల్వ స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల సందర్భంగా మిల్లర్లతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో అసోసియేషన్ అధ్యక్షుడు తేరాల మారుతి, కార్యదర్శి గౌరిశెట్టి చందు, కోశాధికారి చందుపట్ల నాగరాజు, సభ్యులు గౌరిశెట్టి శ్రీనివాస్, నీరుమల్ల నాగరాజు, బేజుగం శ్రీనివాస్, వనపర్తి ఉదయ్, తరుణ్, వరుణ్, రాములు, శ్రావణ్ ఉన్నారు.
Posted inగజ్వేల్ తెలంగాణ సిద్దిపేట హుస్నాబాద్
రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి..




