ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
హుస్నాబాద్, సెప్టెంబరు 17: సిద్దిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కట్కూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు యామ రాజును శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ఘనంగా సన్మానించారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ఎల్ కన్వెన్షన్ హాల్లో ముదిరాజ్ మహాసభ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి చొప్పరి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బండ ప్రకాష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడు యామ రాజు విధులు నిర్వహించే ప్రాంతంలోనే పదేళ్లపాటు స్థానికంగా నివాసం ఉండి విద్యార్థులకు సేవలందించడం అభినందనీయమన్నారు. తన పిల్లలు కీర్తికా పూలేను పదో తరగతి వరకు, శ్రీకాంత్ పూలేను ప్రాథమిక విద్య వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించడం ద్వారా ప్రభుత్వ విద్యపై నమ్మకాన్ని చాటారని పేర్కొన్నారు. పాఠశాలల బలోపేతానికి కృషి చేయడంతో పాటు విద్యాబోధన, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కడం గర్వకారణమన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను సమాజం గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, కరీంనగర్ జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య, హుస్నాబాద్ మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు పొన్నం మల్లయ్య, మండల అధ్యక్షుడు పొన్నబోయిన శ్రీనివాస్, గంగాధరి రాజయ్య, భాషవేని రాజయ్య, గోనెల సంపత్, బొల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.





