ఒకే వాహనంలో ఎమ్మెల్యే, ఎంపీ..! దుబ్బాకలో మారిన రాజకీయ వాతావరణం..
నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒకటైన నాయకులు.. ప్రశంసలు కురిపిస్తున్న ప్రజలు..
ఆశ్చర్యానికి గురైన రెండు పార్టీల కార్యకర్తలు..!
సిద్దిపేట టైమ్స్ అక్బర్ పేట భూంపల్లి ఆగస్టు 31
ఇప్పటి వరకు దుబ్బాక నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా బీఆర్ఎస్ – బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒకే కార్యక్రమానికి వచ్చారంటే చాలు.. కార్యకర్తల నినాదాలు, ఉద్రిక్తత, భారీ పోలీసు బందోబస్తు సాధారణంగా కనిపించేవి. వాటన్నింటికీ భిన్నంగా సోమవారం జరిగిన పరిణామం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అక్బర్ పేట – భూంపల్లి మండలం రామేశ్వరoపల్లి, భూoపల్లి గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు ఒకే వాహనంలో వచ్చి కలిసి వచ్చారు. ఒకరికొకరు ఆప్యాయంగా మాట్లాడుకోవడం, ఒకరికొకరు కొబ్బరికాయలు అందించుకోవడం, అభివృద్ధి పనులను సంయుక్తంగా ప్రారంభించడం, అదే వాహనంలో కలిసి ప్రయాణించడం చూసి కార్యకర్తలే ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే, ఎంపీతో పాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కూడా ఒకే వేదికపై ఉన్నారు. ఎలాంటి పోలీసు బందోబస్తు లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా కార్యక్రమాలు ప్రశాంతంగా సజావుగా జరిగాయి. పార్టీలు వేరైనా, ఎజెండాలు వేరైనా అభివృద్ధి విషయంలో ఒకటిగా ఉండాలనే వారి నిర్ణయంపై నియోజకవర్గ ప్రజల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.



