గౌరవెల్లిపై ఎన్జీటీ కేసు రద్దులో ప్రభుత్వం అట్టర్ ప్లాప్
ప్రాజెక్టుపై ఉన్న కేసులు పరిష్కరించి నీళ్లు నింపే బాధ్యత మంత్రి పొన్నందే
బొమ్మలు, పార్కులు ప్రజల కడుపులు నింపలేవు
కరువు పరిస్థితుల్లో సాగు, తాగునీటిపై దృష్టి సారించాలి
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి జీవనాధారమైన గౌరవెల్లి రిజర్వాయర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ ఆరోపించారు. ప్రాజెక్టుపై ఉన్న ఎన్జీటీ కేసును పరిష్కరించి నీటిని నింపడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని విమర్శించారు. కరువు పరిస్థితులు ముంచుకొస్తున్న నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
శనివారం హుస్నాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సతీష్‌కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి సమస్యను పరిష్కరించలేకపోయారని అన్నారు. ప్రాజెక్టుపై ఉన్న కేసులను పరిష్కరించి నీళ్లు నింపే బాధ్యతను మంత్రి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భూగర్భ జలాలు పెరుగుతాయి
గౌరవెల్లి రిజర్వాయర్‌లో నీటిని నింపితే పరిసర ప్రాంతాల్లో బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. పంటల సాగుకు నీటి లభ్యత మెరుగుపడుతుందని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించి నీటిని నింపామని గుర్తుచేశారు.
ప్రాజెక్టు పూర్తికావడాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులే కొందరిని ప్రోత్సహించి కేసులు వేయించారని సతీష్‌కుమార్ ఆరోపించారు. ఇప్పుడు ఆ కేసులే ప్రాజెక్టుకు అడ్డంకిగా మారాయని విమర్శించారు. పర్యావరణ అనుమతులకు సంబంధించిన కేసులు కోర్టులో కొట్టివేయడంతో సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు. ప్రాజెక్టు విషయంలో మిగిలిన అడ్డంకులను తొలగించి పనులు ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
బొమ్మలు.. పార్కులతో ప్రయోజనమేమిటి?
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన ప్రధాన సమస్యలను పక్కనపెట్టి రహదారుల వెంట బొమ్మలు ఏర్పాటు చేయడం, అక్కడక్కడ పార్కులు నిర్మించడం వంటి పైపై పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. “బొమ్మలు, పార్కులు ప్రజల కడుపులు నింపలేవు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడమే పాలకుల ప్రథమ బాధ్యత” అని అన్నారు. మానేరు-తోటపల్లి ద్వారా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు, దేవాదుల, కాకతీయ కాలువల ద్వారా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు నీరందించడంతో పాటు గౌరవెల్లి రిజర్వాయర్‌ను త్వరగా నింపాలని డిమాండ్ చేశారు. అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్ మండలాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. లేకుంటే రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలపై ప్రజలు చేపట్టే ఆందోళనలకు మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




