జీవో 97 రద్దు చేయాలి.. పాలిటెక్నిక్ విద్యార్థుల భారీ ర్యాలీ

జీవో 97 రద్దు చేయాలి.. పాలిటెక్నిక్ విద్యార్థుల భారీ ర్యాలీ


సిద్దిపేట టైమ్స్ డెస్క్:

ప్రస్తుత సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని, ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సోమవారం హుస్నాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సావుల ఆదిత్య మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పుల వల్ల పాలిటెక్నిక్ కళాశాలల భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుత సాంకేతిక విద్యా విధానాన్ని యథాతథంగా కొనసాగించడంతో పాటు పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి విద్యా వ్యవస్థను ఇతర విభాగాల్లో విలీనం చేయడం వల్ల ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాలనుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.
పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం, ఆధునిక కోర్సులు ప్రవేశపెట్టడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, పరిశ్రమలతో అనుసంధానం పెంచడం, మెరుగైన ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలోని ‘శక్తి’ విభాగంలో పాలిటెక్నిక్ కళాశాలలను చేర్చే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్‌ 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి, ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి సైతం వెనుకాడబోమని సావుల ఆదిత్య హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా హాస్టల్స్ కన్వీనర్ రాజేష్, జిల్లా ఎస్‌ఎఫ్‌డీ కన్వీనర్ చరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాహుల్, నగర కార్యదర్శి రాజు, నగర ఉపాధ్యక్షులు సంతోష్, అంజి, మేఘన, రవళి, సంధ్యతో పాటు వందలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *