చేర్యాల మున్సిపల్ పీఠం బిఆర్ఎస్ కైవసం
చైర్మన్ గా ముస్త్యాల అరుణ
వైస్ చైర్మన్ గా మేడిశెట్టి ఉమా
సిద్దిపేట టైమ్స్ చేర్యాల ప్రతినిధి:
చేర్యాల మున్సిపల్ పీఠాన్ని బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా మున్సిపల్ చైర్మన్ గా బిఆర్ఎస్ పార్టీ ఆరవ వార్డు కౌన్సిలర్ ముస్త్యాల అరుణ బాల నరసయ్య, వైస్ చైర్మన్ గా పదవ వార్డ్ కౌన్సిలర్ మేడిశెట్టి ఉమా శ్రీధర్ లు ఎన్నికయ్యారు. చేర్యాల పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి కార్యాలయంలో నోడల్ ఆఫీసర్, డిపిఓ రవీందర్ ఆధ్వర్యంలో సోమవారం చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఏడుగురు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఐదుగురు హాజరయ్యారు. ముందుగా 11 గంటలకు నూతనంగా ఎన్నికైన 12 వార్డుల కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషములకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా మున్సిపల్ చైర్ పర్సన్ గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరవ వార్డు కౌన్సిలర్ ముస్త్యాల అరుణను రెండవ వార్డ్ కౌన్సిలర్ కమలాపురం గీతాంజలి ప్రతిపాదించగా తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ వీరబత్తిని సదానందం బలపరచగా సగానికి పైగా బలం ఉండడంతో అరుణను చైర్మన్ గా అధికారులు ప్రకటించారు. అదే క్రమములో వైస్ చైర్మన్ పదవికి పదవ వార్డు అభ్యర్థిని మేడిశెట్టి ఉమా శ్రీధర్ పేరును నాలుగో వార్డు కౌన్సిలర్ నిమ్మ సుప్రజా రాజీవ్ రెడ్డి ప్రతిపాదించగా 11వ వార్డు కౌన్సిలర్ ఇజాజ్ అహ్మద్ బలపరచగా సగానికి పైగా బలం ఉండడంతో ఆమెను వైస్ చైర్మన్ గా ప్రకటించారు. అయితే చైర్మన్ ఎన్నిక జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సరిపోయే బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లలో ఒకటవ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన ఒగ్గు వెంకటమ్మ చేతి ఎత్తి ఓటు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సమావేశంలో పార్టీ కండువా వేసుకోకపోవడం బిఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయడం లో పలు అనుమానాలకు తావిచ్చింది. ఎన్నిక అనంతరం అధికారులు చైర్మన్ అరుణ, వైస్ చైర్మన్ ఉమా లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేందర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నిక సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో చేర్యాల సిఐ రమేష్, ఎస్సై నవీన్ తో పాటు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.






