అవినీతి ఆరోపణల పై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.. బిజెపి నాయకుల డిమాండ్..

అవినీతి ఆరోపణల పై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.. బిజెపి నాయకుల డిమాండ్..

అవినీతి ఆరోపణల పై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..
సొసైటీ చైర్మన్ బాదే చంద్రం వ్యక్తిగత ఖాతాలోకి రూ. 73 లక్షల మళ్లింపు..!
మున్సిపాలిటీలో రూ. 1.60 కోట్లు, కొనాపూర్‌లో రూ. 5 కోట్ల మెగా స్కామ్..!
అవినీతి సొమ్ము వాటాల కోసం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతల కొట్లాటలు..!
కలెక్టరేట్ ముట్టడికి బిజెపి నాయకులు శంకర్ గౌడ్, అవినాష్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాగి రాములు పిలుపు.

సిద్దిపేట టైమ్స్ రామాయంపేట జూలై 14

రామాయంపేట నియోజకవర్గంలో గత టీఆర్ఎస్ (బీఆర్ఎస్) హయాంలో సామాన్య రైతుల కడుపు కొట్టి, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాగి రాములు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ మెగా కుంభకోణాలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.

*పక్కా ఆధారాలతో దొరికిపోయిన సొసైటీ చైర్మన్ బాదే చంద్రం..!!!*

*అయినా అధికారుల చర్యలు శూన్యం*

రైతుల సేవ కోసం ఉన్న రామాయంపేట పీఏసీఎస్ సొసైటీని చైర్మన్ బాదే చంద్రం తన సొంత వ్యాపార సంస్థలా మార్చుకున్నారని రాగి రాములు ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో మక్కల సేకణ పేరిట టెంట్లు, డోజర్లు, తాగునీటి ఖర్చుల కింద లక్షలాది రూపాయలు దోచేశారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 13ల పైచిలుకు కమిషన్‌లో.. క్వింటాల్‌కు రూ. 6.75 పైసల చొప్పున ఏకంగా రూ. 73 లక్షల పైచిలుకు ప్రజాధనాన్ని చైర్మన్ బాదే చంద్రం నేరుగా తన పర్సనల్ బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకున్నారు. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు మా వద్ద ఉన్నాయి. దీనిపై కోఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.

*మున్సిపాలిటీలో రూ. 1.60 కోట్ల లూటీ.. నిజమేనని తేలింది..!!!*

మున్సిపాలిటీలో రూ. 1.60 కోట్ల మేర భారీ అవినీతి జరిగిందని తాము గత రెండున్నరేళ్లుగా ధర్నాలు చేస్తూనే ఉన్నామని బీజేపీ నేతలు గుర్తుచేశారు. ఆనాడు ఈ అక్రమాలను కప్పిపుచ్చడానికి అధికారులు, లీడర్లు ప్రయత్నించినప్పటికీ.. చివరకు మున్సిపల్ చైర్మనే స్వయంగా ఈ అవినీతిని ఒప్పుకోక తప్పలేదని ఎద్దేవా చేశారు. ఈ భారీ దోపిడీ సొమ్మును వెంటనే రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.

కొనాపూర్‌లో రూ. 5 కోట్ల దోపిడీ.. వాటాల కోసం సోషల్ మీడియాలో కొట్లాటలు!

కొనాపూర్ సహకార సంఘంలో (PACS) మాజీ ఎమ్మెల్యే పద్మా భర్త దేవేందర్ రెడ్డి నేతృత్వంలో సుమారు రూ. 5 కోట్ల మెగా స్కామ్ జరిగిందని ఆడిట్ నివేదికలే స్పష్టం చేశాయని ఆయన అన్నారు. ఇందులో రూ. 2 కోట్లు రికవరీ చేయాలని నోటీసులు ఇస్తే, దేవేందర్ రెడ్డి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుని కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ లూటీ సొమ్ములో వాటాల కోసం టీఆర్ఎస్ నేతలు, పీఏసీఎస్ డైరెక్టర్లు నీకెంత.. నాకెంత?అంటూ వాట్సాప్ లలో బహిరంగంగా బూతులు తిట్టుకుంటూ కొట్టుకోవడం రామాయంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అవినీతికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయి అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ శంకర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి, భాను, పబ్బ సత్యం, అక్కన్నపేట సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అవినీతికి వ్యతిరేకంగా నినదించారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *