


కలెక్టరేట్ నీడలోనే ‘భూ’ భాగోతం!
– దుద్దెడలో విచ్చలవిడిగా ప్రభుత్వ, అసైన్డ్ భూముల కబ్జాలు
– లొసుగులను ఆసరా చేసుకుని నకిలీ సాదాబైనామాల సృష్టి
– ఒకచోటి సర్వే నంబర్.. మరోచోట విక్రయం.. కోట్లల్లో దందా!
– లబోదిబోమంటున్న కొనుగోలుదారులు
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట, జూన్ 13
అది జిల్లా సర్వాధికారి కూర్చునే ప్రజా పరిపాలన కేంద్రం (కలెక్టరేట్). దానికి కూతవేటు దూరంలోనే ప్రభుత్వ భూమికి రక్షణ కరువైంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో ల్యాండ్ మాఫియా పడగ విప్పింది. ప్రభుత్వ భూములు, పేద దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములు, సీలింగ్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకున్న భూములే లక్ష్యంగా ఒక ముఠా కోట్ల రూపాయల దందాకు తెరలేపింది. గత దశాబ్ద కాలంగా యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ అధికారులు, ‘మామూళ్ల’ మత్తులో జోగుతూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నకిలీ రికార్డులు..
దుద్దెడ గ్రామానికి చెందిన కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు ఒక సిండికేట్‌గా ఏర్పడి ఈ భూదందా నడిపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ధరణి, ప్రస్తుత ప్రభుత్వ ‘భూభారతి’ పోర్టల్‌లోని లొసుగులను వీరు పెట్టుబడిగా మార్చుకున్నారు. నకిలీ సాదాబైనామా కాగితాలను సృష్టించి, తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని మేనేజ్ చేస్తూ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే… కాగితాల్లో ఉన్న సర్వే నంబర్ ఒకచోట ఉంటే, కొనుగోలుదారులకు చూపించే భూమి మరోచోట ఉంటోంది.
సర్వే నంబర్ 745/ఆ లో కోట్లాది రూపాయల ల్యాండ్ స్కామ్:
దుద్దెడ శివారులోని టోల్ గేట్ నుండి మర్పడగ వెళ్లే దారిలో, కోట్ల విలువచేసే సర్వే నంబర్ 745/ఆ లోని 33 గుంటల ప్రభుత్వ భూమిని స్థానిక మాజీ ఉపసర్పంచ్ గుండెల్లి ఆంజనేయులు, చిలుముల రామ్మోహన్, కొమురవెల్లి యాదయ్య తదితరులు కబ్జా చేసి ప్రహరీ గోడలు, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఏకంగా ప్రభుత్వ భూమినే తమ పేరిట రెగ్యులరైజ్ చేయించుకోవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన జీవో 59 కింద దరఖాస్తు చేసుకోవడం వీరి తెగింపునకు అద్దం పడుతోంది.
కలెక్టరేట్ ప్రహరీ గోడే టార్గెట్!
హైదరాబాద్ ప్రధాన రహదారికి సమీపంలో, కొత్త కలెక్టరేట్ ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 655 లో సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని జక్కుల రాజు, గుండెల్లి ఆంజనేయులు తదితరులు నకిలీ సాదాబైనామా పత్రాల ద్వారా తమ పేరిట మార్చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా సర్వే నంబర్ 657 లోని అసైన్డ్, సీలింగ్ భూములను కూడా గుట్టుచప్పుడు కాకుండా ఇతరులకు విక్రయించి కోట్లు ఆర్జించారు. అదే విధంగాదుద్దెడ గ్రామ పరిధిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వెనుక వైపు ఉన్న సర్వే నంబర్ 202 ఆ/6 లోని 30 గుంటల అసైన్డ్ భూమిపై ఈ మాఫియా కన్ను పడింది. ‘సేలంపు’ అనే గ్రామ పరిధిలోని ఒక నకిలీ సర్వే నంబర్ వేసి, ఈ భూమిని ప్లాట్లుగా మార్చి సిద్దిపేటకు చెందిన పలువురు అమాయకులకు విక్రయించారు. తీరా డబ్బులు కట్టి, ప్లాట్లు స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన కొనుగోలుదారులు.. అక్కడ ఆ సర్వే నంబరే లేదని తెలిసి గుండెలు బాదుకుంటున్నారు. ఇదే తరహాలో సర్వే నంబర్ 173/ఈ 4/1 (1 ఎకరం 1 గుంట) మరియు 173/ఈ 4/2/1 (1 ఎకరం 10 గుంటలు) భూములను గరుడ వెంచర్ పక్కన ఉన్నట్లు నమ్మించి, గతంలో రజకులు, ఆరెకటికల పేరిట ఉన్న రికార్డులను మార్చి పాశం వేమారెడ్డి అనే వ్యక్తికి విక్రయించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ భూమి క్షేత్రస్థాయిలో జీకురు యాదగిరి అనే వ్యక్తి పేరిట మరోచోట ఉండటం గమనార్హం.
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం..
ఈ భూమాఫియా చేస్తున్న అరాచకాలకు కొండపాక తహసిల్దార్ కార్యాలయమే కేంద్ర బిందువుగా మారిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులను, బలహీన వర్గాల అసైన్డ్ భూములను కాపాడాల్సిన రక్షకులే భక్షకులుగా మారి లంచాలకు ఆశపడి విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లకు సహకరిస్తున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్మును ల్యాండ్ మాఫియా పాలు చేసి, న్యాయం కోసం తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న బాధితులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ఉన్నతాధికారులు స్పందించేనా?
కలెక్టరేట్‌కు అత్యంత సమీపంలోనే ఇంత పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరుగుతున్నా జిల్లా యంత్రాంగం ఎందుకు మౌనంగా ఉందనేది స్థానికంగా చర్చనీయాంశమైంది.
బాధితుల డిమాండ్…
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి దుద్దెడ శివారులోని 745/ఆ, 655, 657, 202 ఆ/6, 173 సర్వే నంబర్లపై సమగ్ర విచారణ జరిపించాలి. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, అమాయకులను మోసం చేసిన సదరు మాఫియా లీడర్లపై పిడి యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు, గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




