బైక్‌ను ఢీకొన్న కారు: తల్లీకొడుకులకు తీవ్ర గాయాలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణ శివారులోని జ్యోతి నగర్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల మహేష్ (28) తన తల్లి సారవ్వ (48)తో కలిసి కొండాపూర్ నుంచి హుస్నాబాద్‌కు బైక్‌పై వస్తున్నారు. జ్యోతి నగర్ సమీపంలోకి రాగానే మడద నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న కారు వీరి బైక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. కారు వేగం ఎక్కువగా ఉండటంతో బైక్ వెనుక భాగాన్ని ఎక్కేసింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న సారవ్వ కాలు విరిగిపోగా, నడుపుతున్న మహేష్ భుజం విచ్ఛిన్నమైంది. బాధితులిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే హుస్నాబాద్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




