హుస్నాబాద్‌లో కోతుల స్వైరవిహారం.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం!
ఒకేరోజు ఇద్దరిపై దాడి..పట్టణంలో ఆగని కోతుల అగడాలు!
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కోతుల బెడద రోజురోజుకూ మితిమీరుతోంది. వానర మూకల అగడడాలకు అంతులేకుండా పోతోంది. గురువారం పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో కోతులు జరిపిన ఆకస్మిక దాడుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడటం స్థానికంగా కలకలం రేపింది. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన కూడలి అయిన నెహ్రూ చౌరస్తాలో చోటుచేసుకున్న ఘటన పలువురిని కలిచివేసింది. స్థానిక నివాసి గంగం లక్ష్మారెడ్డి కుమార్తె వివాహం గురువారమే జరగాల్సి ఉండగా, అదే రోజు ఉదయం ఆయనపై కోతులు ఒక్కసారిగా విరుచుకుపడి గాయపరిచాయి. పెళ్లి పనుల సందడిలో ఉండాల్సిన తండ్రి, ఇలా అనూహ్యంగా ఆసుపత్రి పాలవ్వడంతో ఆ కుటుంబంలో ఆందోళన నెలకొంది. మరో ఘటనలో, సముద్రాల గ్రామానికి చెందిన దూడం చిరంజీవి రిలయన్స్ టవర్ సమీపంలో తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కోతులు అకస్మాత్తుగా దాడికి దిగాయి. ఈ దాడితో బ్యాలెన్స్ తప్పి వాహనంపై నుంచి కింద పడిపోవడంతో చిరంజీవికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితులకు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. రెడ్డి కాలనీ, నెహ్రూ చౌరస్తా పరిసరాల్లో కోతుల సంచారం అధికంగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి, కోతులను పట్టించి దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేయాలని, సామాన్యుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని హుస్నాబాద్ ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అధికారుల జాప్యం మరిన్ని ప్రమాదాలకు దారితీసేలా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




