రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..
సిద్ధిపేట టైమ్స్, మద్దూరు:
రాజకీయాలకతీతంగా మండల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడిగ కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.మద్దూరు మండలంతో గత 20 సంవత్సరాల నుండి తనకు అనుబంధం ఉందని అన్నారు.తొలి,మాలి దశ తెలంగాణ పోరాటంలో ముందు ఉంటూ మద్దూరు మండలం తనదైన ముద్ర వేసుకుందన్నారు.తెలంగాణ సాయుధ పోరాటంలో మండలంలోని ప్రతి గ్రామం పోరాటంలో పాలుపంచుకుందని గుర్తు చేశారు.ఈ ప్రాంతం పోరాటాలకు ముందుంటూ చైతన్యంతో వెళ్లి విరిసిన ప్రాంతమని అన్నారు.పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేసి గెలిపించారని అన్నారు.విద్య వైద్యం విషయంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి సేవ చేస్తానని తెలిపారు.ఈ ప్రాంత సమస్యలు,మండల హక్కుల సాధన కోసం,నిధుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు.5 సంవత్సరాలుగా ఎంపీపీ,జడ్పీటీసీ,ఎంపీటీసీగా సేవలు అందించాలని వారిని అభినందించారు.పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయాలని సూచించారు.అంతకుముందు మండల సభలో ముందుగా మండలంలో సర్వేయర్ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని దీంతో ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకుంటూ గొడవలు పడుతున్నారని వెంటనే సర్వేయర్ ను నియమించాలని రేబర్తీ ఎంపీటీసీ కూరళ్ళ రాజు గౌడ్ సభ దృష్టికి తీసుకురాగా సర్వేర్ ను నియమిస్తామని మద్దూరు తహసీల్దార్ సంజీవ్ తెలిపారు.ఉపాధి హామీ పనులపై గ్రామాల్లో అవగాహన కల్పించడం లేదని ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలని ఎంపీపీ కృష్ణారెడ్డి,జడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి ఈసీ పరశురాములును హెచ్చరించారు.3 సంవత్సరాల నుండి జాలపల్లి గ్రామంలోని పాఠశాలలో మరుగుదొడ్లు కిచెన్ షెడ్ ల నిర్మాణం గురించి ఎన్నిసార్లు చెప్పిన ఈసీ పరశురాములు పట్టించుకోవడంలేదని జాలపల్లి ఎంపిటిసి చెట్కూరి కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాలలు ప్రారంభమైనందున త్వరగా పనులు పూర్తి చేయాలని ఎంపీపీ ఈసీని ఆదేశించారు.జాలపల్లి,కొండాపూర్ గ్రామాలలో రెండు నెలల నుంచి మిషన్ భగీరథ నీరు రావడంలేదని ఎంపీటీసీలు సభదృష్టికి తీసుకురాగా రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు.వర్షాకాలం ప్రారంభం అవుతుంది అందులో మిషన్ భగీరథ పైపులు కేజీలు లేకుండా చూడాలని ఎంపీపీ అధికారులకు సూచించారు.వ్యవసాయ బావుల వద్ద,ఇళ్లపైన లూజ్ వైర్లు ఉన్నాయని వాటిని సమస్యను పరిష్కరించాలని పలువురు ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకురాగా ఇప్పటివరకు 20 పోల్ లను ఏర్పాటు చేశామని త్వరలోనే మిగతా వాటిని కూడా ఏర్పాటు చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.అనంతరం పదవి కాలం పూర్తయిన ఎంపీటీసీలను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామ్మోహన్,తహసీల్దార్ సంజీవ్,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.