తొత్తులుగా వ్యవహరిస్తే పట్టించుకోము..
- చక్రధర్ గౌడ్ కేటీఆర్,హరీష్ రావులకు కీలుబొమ్మ
- కూడవెళ్లి రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
- మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
సిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లి


బిఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారిన నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే పట్టించుకోమని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. చక్రధర్ గౌడ్ కేటీఆర్, హరీష్ రావులకు కీలుబొమ్మ అని విమర్శించారు.
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూoపల్లి మండలం కూడవెల్లిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చక్రధర్ గౌడ్ లాంటి నాయకులు గుర్తింపు కోసం తనలాంటి వారిపై విమర్శలు చేస్తారని, వాటిని పట్టించుకోనని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్దపెద్ద నాయకులపై మాట్లాడేది ఉందని త్వరలోనే వారి చిట్టా విప్పుతానని తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ నాయకుల కంటిపై కొనుక్కు లేకుండా చేస్తానని అన్నారు. బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాననే ఉద్దేశంతో చక్రధర్ గౌడ్ లాంటి కొంతమంది నాయకులకు డబ్బులు ఇచ్చి విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. అడ్డుపడేటువంటి నాయకులను బుల్డోజర్ తో తొక్కించుకుంటూ ముందుకు వెళ్తానని మైనంపల్లి అంటేనే ధైర్యమని, ప్రాణం పోయేంత వరకు వెనుకడుగు వేయనని తెలిపారు. తనకు ఎలాంటి వ్యసనాలు లేవని, వ్యసనాలు ఉన్న రాజకీయ నాయకులకు మాత్రమే భయం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి,దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.