పండుగ వాతావరణంలో వినాయక నిమజ్జనం నిర్వహించుకోవాలి
పోలీసుల సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలి
హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్ కుమార్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న వినాయక మండపాల ఆర్గనైజర్లు, కార్యవర్గ సభ్యులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు నిమజ్జనం సందర్భంగా పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి ఒక పండుగ వాతావరణం లో వినాయక నిమజ్జనం కార్యక్రమం నిర్వహించుకోవాలని హుస్నాబాద్ ఏసిపి సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు.
భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతిలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని, హుస్నాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న వినాయక మండపాల ఆర్గనైజర్లకు గురువారం పలు సూచనలు జారీ చేశారు. నిర్వాహకులు వినాయక నిమజ్జనం ఎంచుకున్న తేదీలలో పూర్తి చేయాలని తెలిపారు. ఊరేగింపు సమయంలో ఇతరులపై రంగు, గులాల్ చల్లవద్దని అపరిచిత వ్యక్తులను నమ్మకుండా మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొనవద్దని సూచించారు. చెరువులు కుంటలు నిండి ఉన్న కారణంగా లోతు తెలియ కుండా దిగి ప్రమాదాలకు గురి కావద్దని చిన్నపిల్లలను చెరువుల వద్దకు తీసుకు వెళ్ళవద్దని తెలియజేశారు. నిమజ్జనం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వినాయక మండపాల ఆర్గనైజర్లు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు పోలీసు అధికారుల సూచనలు పాటించి ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకోవాలని కోరారు..