మత్తడి కాలువను పూడ్చి వెంచర్ నిర్మాణం..
వెంచర్ కోసం కాలువనే మళ్లించారు..
అస్తవ్యస్తంగ వరద కాలువ..
పట్టించుకోని అధికారులు..!
పొంచిఉన్న వరద ప్రమాదం..

సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి, ఆగస్టు 30

వెంచర్ నిర్మంచడంలో రియల్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. వారి రియల్ దందా కోసం ఏకంగా మత్తడి కాలువను దారి మళ్లించారు. రియల్టర్లు కాల్వల మళ్లీంపు, మత్తడి కాలువ ధ్వంసం.. ఇలా రియల్టర్లు ఏం చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. రియల్టర్లు చేసే కబ్జాలను రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువను అక్రమార్కులు కబ్జా చేస్తుంటే.. అధికారులు రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తున్నారా..? లేదా అక్కడ రూల్స్ గిల్స్ జాన్తా.. నై.. అంటున్నారా..? ఎలాంటి పర్మషన్లు లేకుండానే వెంచర్ నిర్మించారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండానే కాలువ మళ్లించడం జరిగిందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సిద్దిపేట జిల్లా సిద్ధిపేట పట్టణం.. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం.. బోగేశ్వర ఆలయం.. సమీపంలో పంట పొలాలను చదును చేసి.. ఎర్ర చెరువు మత్తడి కాలువను పూడ్చి కోందరు రియాల్టర్లు రాజకీయ నేతల అండదండలతో భారీ ఎత్తున వెంచర్ చేశారు. అయితే వెంచర్ నిర్మణాం లో ఎర్రచెరువు మత్తడి నాలాలు కనుమరుగు చేసేశారు. గతంలో ఇదే కాలువ వెంట ఉన్న కుంటను స్థానికంగ ఉన్న ఒక రాజకీయ నాయకుడు మట్టితో కూడ్పి వెంచర్ నిర్మణాం చేశాడు.. ప్రస్తుతం ఈ కాలువ ద్వారా ఎర్రచెరువు మత్తడి దూకినప్పుడు ఈ కాలువ ద్వారా చింతల చెరువుకు నీరు చేరుతుంది. ఈ అక్రమ వెంచర్ల నిర్మాణంతో కాలువ అస్తవ్యస్తం అయ్యింది. ఫలితంగా వరద నీరు మొత్తం నిలిచిపోయి.. ప్రజలకు ఇబ్బందిగా మారింది..
దింతో పెద్ద ప్రమాదం పొంచి ఉందని, ప్రకృతితో ఆటలు ఆడుతూ ప్రాణం మీదకు కొని తెచ్చుకోవడమే అంటున్నారు స్థానికులు. భారీగా వర్షాలు కురిస్తే వరద నీరు ఉధృతంతో ప్రజల ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి వస్తుందంటూ స్థానిక ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా కాలువను కబ్జా చేసి వెంచర్. నిర్మాణం చేస్తున్న వారిని అడ్డుకొని.. సంబంధిత అధికారులు భవిష్యత్తులో వరద ప్రమాదం రాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

భవిష్యత్తులో ప్రమాదం..
ఎర్ర చెరువు నుంచి ఏళ్లుగా వర్షపు వరద నీరు ఈ కాలువ ద్వారా వస్తుంది. అలాంటి కాలువనే రియల్టర్ ఏకంగా పూడ్చేశాడు. తన పొలంలో వెంచర్ వేసుకునేందుకు కాలువ అడ్డుగా ఉండడంతో ఈ కార్యానికి ఒడిగట్టాడు. ఏకంగా తన పొలం వెలుపలకు కాలువను మళ్లించాడని విమర్శలు నినిపిస్తున్నాయి. వెంచర్ యజమాన్యం దౌర్జన్యంపై పక్కన ఉన్న ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చక్కగా ఉన్న కాలువను మలుపు, మలుపులు తీసి వేములవాడ, సిద్దిపేట ప్రధాన రహదారిన ఉన్న వంతెన వద్ద సైతం ఇలా ఎవరు పడితే వారు.. ఇష్టారాజ్యంగా కాలువను మళ్లించుకుంటూ పోతున్నారు. దీంతో భవిష్యతలో ప్రమాదం తప్పవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రియల్టర్ లకు నాయకుల అండదండలు
సిద్దిపేటలో కొత్తగా ఎక్కడైనా వెంచర్ చేయాలంటే నాలా మార్పిడిలో.. స్థానిక నాయకుల అండదండలు దండిగా ఉన్నాయట… రియల్టర్లు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా (నాలా) మార్పిడి చేసుకున్న వెంటనే స్థానిక నాయకులను సంప్రదిస్తున్నారు. వారు ఎలాంటి పంట, కాల్వలనైనా సులువుగా వెంచర్‌లో కలిపేందుకు సలహాలు ఇచ్చి దగ్గరుండి ఆ పనిని పూర్తి చేయిస్తున్నారు. ఇదేమిటి అని ప్రశ్నించిన స్ధానికులను, రైతులను బెదిరింపుల కు గురి చేస్తుంటారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కాలువను మాయం చేయడానికి సదరు రియల్టర్లు నాయకులు, అధికారులకు భారీ ఎత్తున మామూళ్లు సమర్పించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నియంత్రించాల్సిన సమయంలో మౌనం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది సంబంధిత అధికారుల పరిస్థితి. దాంతో వందల సంవత్సరాల చరిత్ర గల నాలాలు కనుమరుగవుతున్నాయి. సిద్దిపేట హైదరాబాద్ రహదారిలోని బావిస్కానా పూల్.. ఆక్రమణ కు గురైంది.. అపార్టుమెంట్లు నిర్మాణమయ్యయి.. పలితంగ ఈ మధ్య కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట లోని పలు కాలనీలు ముంపుకు గురయ్యాయి.. నాలాలపై యథేచ్ఛగా అక్రమ కట్టడాలు కడుతున్నా వాటిని నియంత్రించడంలేదు. పాలకులు పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా అందినకాడికి దండుకొని అనుమతులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో నాలాలు పూర్తిగా కుచించుకుపోయి వర్షాకాలం వరద నీరు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు.






