హుస్నాబాద్‌లో కలకలం… మహిళ ఒడిలోని బాలుడిని బలవంతంగా తీసుకెళ్లే యత్నం !
మహిళకు అనుమానాస్పద వ్యక్తుల బెదిరింపు… మహిళకు పోలీసుల రక్షణ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మానవత్వం మాయమవుతున్న పరిణామాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా హుస్నాబాద్ బస్ స్టాండ్ వద్ద చోటుచేసుకున్న ఓ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ కాంప్లెక్స్ పరిసరాలలో చిన్న బాబుతో కలిసి బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు 500 రూపాయలు ఇచ్చి, ఆమె బాబును తమకు అప్పగించమని బెదిరించారని తెలుస్తోంది. దీంతో భయపడిన మహిళ తన బాబుతో కలిసి ఏడుస్తూ బస్ స్టాండ్‌కు చేరుకుంది.ఈ సంఘటనను గమనించిన ప్రయాణికులు వెంటనే బస్ స్టాండ్ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సెక్యూరిటీ వెంకటేష్ మరియు ఇతర సిబ్బంది మహిళను ప్రశ్నించగా ఆమె నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు హుస్నాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.పోలీసుల సూచన మేరకు బ్లూ కోటు సిబ్బంది కుమార్, సంపత్ సంఘటన స్థలానికి చేరుకొని ఆ మహిళను తరిగొప్పుల గ్రామానికి చెందిన కోమలగా గుర్తించారు. వెంటనే ఆమెను మరియు ఆమె బాబును జనగాం వెళ్తున్న బస్సులో వయా తరిగొప్పుల ప్రయాణికులకు అప్పగించి పంపించారు.ఈ ఘటనపై హుస్నాబాద్ ఎస్‌ఐ లక్ష్మారెడ్డి స్వయంగా మానిటరింగ్ చేయడం విశేషం. మహిళ తమ గ్రామానికి సురక్షితంగా చేరే వరకు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు.ఈ ఘటన మానవ అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తోంది. పోలీసులు పూర్తి విచారణ జరుపుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల వివరాలను కనుగొనే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.