హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేయూత
సిఎస్‌ఆర్ నిధులతో సుమారు ₹1.5 కోట్లు విలువైన అధునాతన పరికరాలు మంజూరు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) నిధుల కింద అధునాతనమైన వైద్య పరికరాలను మంజూరు చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు హుస్నాబాద్ బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో బీజేపీ నాయకులు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని బండి సంజయ్‌ను కోరగా, ఆయన స్పందించి సుమారు ₹1.5 కోట్లు విలువైన పరికరాలను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫౌండేషన్ ద్వారా మంజూరు చేశారు.
ఈ పరికరాలు హుస్నాబాద్ ప్రాంత పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని నాయకులు తెలిపారు. మంజూరైన పరికరాలలో ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, మల్టీ పారామీటర్ మానిటర్, ఆటోక్లేవ్ యంత్రం, డయాతెర్మీ, అనస్థీషియా వర్క్ స్టేషన్, ఫీటల్ మానిటర్, జనరల్ సర్జరీ పరికరాలు, ఎమర్జెన్సీ రికవరీ యూనిట్, త్రీ సీటర్ చెయర్స్, ఈఎన్‌టి హెడ్‌లైట్ మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం ఆసుపత్రి సిబ్బంది ఆయా విభాగాలలో పరికరాల ఫిట్టింగ్ పనులను ప్రారంభించారు. ఈ పరికరాలు వారం రోజులలో ప్రజల వినియోగానికి అందుబాటులోకి వస్తాయని బీజేపీ హుస్నాబాద్ పట్టణ నాయకులు తెలిపారు. వైద్య రంగంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చూపిన ఆసక్తి, ప్రజల ఆరోగ్యంపై చూపుతున్న కృతనిశ్చయానికి నాయకులు అభినందనలు తెలిపారు.





