తారవ్వకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ.50 వేల ఆర్ధిక సాయం
ఢిల్లీ నుండి తారవ్వకు ఫోన్ చేసిన కేంద్ర మంత్రి
ధైర్యంగా ఉండాలని ఓదార్పు…అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
భారీ వర్షాలతో చేతికొచ్చిన పంట నీళ్లలో కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరైన హుస్నాబాద్ నియోజకవర్గం పోతారం గ్రామానికి చెందిన కెడికె తారవ్వకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అండగా నిలిచారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే కొద్దిసేపటి క్రితం తారవ్వకు ఫోన్ చేశారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగు ఎకరాల్లో వరి వేశానని, పండించిన పంట వడ్లన్నీ నీళ్లలో కొట్టుకుపోయాయని ఈ సందర్బంగా తారవ్వ వాపోయారు. బాధపడొద్దని తక్షణ సాయంగా రూ.50 వేలు పంపిస్తున్నట్లు చెప్పారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. అనంతరం హుస్నాబాద్ బీజేపీ నేత కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ద్వారా రూ.50 వేల మొత్తాన్ని ఆమెకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాంగోపాల్ రెడ్డికి సైతం కేంద్ర మంత్రి ఫోన్ చేసి తారవ్వ కుటుంబానికి అండగా నిలవాలని, బాధితులను ఆదుకునే విషయంలో ముందుండాలని సూచించారు.





