పండుగ పూట తప్పని పడిగాపులు..
వర్షాన్ని లెక్కచేయకుండా యూరియా కోసం క్యూ లైన్..
ఉదయం నుంచి క్యూ కట్టిన రైతులు..
అయినా దొరకని యూరియా బస్తాలు..
సిద్దిపేట టైమ్స్, నంగునూరు, ఆగస్టు 27 :

పండుగ పూట రైతులు యూరియా బస్తాల కోసం నానా యాతనలు పడ్డారు. రాష్ట్రమంతా వినాయక చవితి పర్వదిన వేడుకల్లో ఉంటే సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని ఆగ్రోస్ ఎదుట బుధవారం కురుస్తున్న జోరువానను లెక్క చేయకుండా యూరియా బస్తాల కోసం క్యూ కట్టారు. బ్యాంకు తడుస్తూ వరుసలో నిలబడ్డప్పటికీ రతులందరికీ సరిపోయే బస్తాలు దొరకక పోవడంతో రైతుల నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో రైతుల కష్టాలు తీరడం లేదు. ఇందుకు వర్షాన్ని లెక్క చేయకుండా పండుగ పూట యూరియా కోసం రైతులు క్యూ కట్టడమే సజీవ సాక్ష్యం. యూరియా కోసం నంగునూరులో విధవరం రైతులు పడరాని పాట్లు పడ్డారు. రైతులు ఉదయం నుంచే యూరియా బస్తాల కోసం క్యూ కట్టారు. కేవలం 550ల బస్తాలు మాత్రమే అందుబాటులో ఉండడంతో సగం మందికి కూడా యూరియా దక్కలేదు. ఈ సందర్భంగా బస్తాల కోసం రైతుల మధ్య తోపులాట జరిగింది. రాజగోపాల్ పేట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గంటల తరబడి వేచి చూసిన రైతులు యూరియా దొరకదని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వంపై ఆవేదనను వెళ్లగక్కారు. యూరియా అందుబాటులో లేక పంటల సాగుకు తాము ఇబ్బందులు పడుతుంటే, కొరత లేదని ప్రభుత్వం చెప్పడంపై రైతులు మండి పడ్డారు. ప్రభుత్వం సరైన ప్రణాళికతో యూరియాను అందుబాటులో ఉంచడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియాను రైతులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. యూరియా లేక తమ పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

*మండల వ్యవసాయ అధికారిని అడ్డుకున్న రైతులు*
బుధవారం నంగునూరు లోని ఆగ్రోస్ కేంద్రానికి 554 యూరియా బస్తాలు మాత్రమే వచ్చాయి. క్యూ లైన్లో రైతులు ఎక్కువ మంది ఉండడం, వర్షం కురుస్తుండడంతో రైతులకు టోకెన్లను వ్యవసాయ అధికారులతో పాటు, నంగునూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధికారులు అందించారు. ఈ క్రమంలో వచ్చిన బస్తాల కంటే ఎక్కువ టోకెన్లు అందించారు. దీనికి తోడు ఆగ్రోస్ కేంద్రంలో బస్తాలను ఇచ్చేందుకు అవసరమైన ఓటీపీ కోసం రైతుల వద్ద ముందుగానే ఆధార్ కార్డులు తీసుకున్నారు. ఈ క్రమంలో రాసిన టోకెన్ల కంటే ఎక్కువ ఆధార్ కార్డులు తీసుకున్నారు. దీంతో అందరికీ బస్తాలు అందలేదు. ఆగ్రహించిన రైతులు మండల వ్యవసాయ అధికారి బి.గీతను అడ్డుకున్నారు. కదలకుండా కారు చుట్టుముట్టారు. తమకు యూరియా బస్తాలు ఇచ్చే వరకు కదలనిచ్చేది లేదంటూ అడ్డుకున్నారు. సుమారు రెండు గంటల పాటు కదలనివ్వలేదు. విషయం తెలుసుకున్న రాజగోపాలపేట ఎస్సై వివేక్ ఆధ్వర్యంలో పోలీసులు నంగునూరుకు చేరుకుని రైతులకు నచ్చజెప్పి పంపించారు.






