పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తే సహించేది లేదు..
ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ..
సిద్దిపేట టైమ్స్, గజ్వేల్ ప్రతినిధి
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక
గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించాలనే దురుద్దేశంతో గ్రూపులను ప్రోత్సహిస్తే సహించేది లేదని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మడుపు భూంరెడ్డి, గంగుమళ్ల ఎలక్షన్ రెడ్డిలతో కలిసి పెద్ద ఎత్తున నియోజకవర్గ సీనియర్ నేతలు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను వారు ఆమె దృష్టికి తెచ్చారు. పదవుల పందేరం పేరుతో కొంతమంది పనిగట్టుకుని పార్టీకి నష్టం కలిగేలా ప్రోత్సహిస్తూ పార్టీకి చేటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీకి ఏరోజు కూడా పనిచేయని వారు తమ రాష్ట్ర పార్టీ పదవులను అడ్డం పెట్టుకొని గ్రూపులు, వర్గాలుగా విభజిస్తున్నట్లు ఆమె దృష్టికి తెచ్చారు. గాంధీభవన్ కేంద్రంగా ఉంటూ గజ్వేల్ లో గ్రూపులను ప్రోత్సహించడం ఎంత మాత్రం తగదని, పార్టీ అధిష్టానం దృష్టి సారించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు పూర్తిగా తనకు తెలుసని, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి నర్సారెడ్డి పనితీరుపై తనకు పూర్తి నమ్మకం ఉందని, మూడు దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేసినట్లు గుర్తు చేశారు. గత పదేళ్లుగా నర్సారెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయగా, పార్టీ పిలుపుమేరకు ఎన్నో రాష్ట్రస్థాయి కార్యక్రమాలను విజయవంతం చేసినట్లు చెప్పారు. గజ్వేల్ ఇన్చార్జి నర్సారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ అధిష్టానం సంపూర్ణ ఆశీస్సులు ఉంటాయని, క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇన్చార్జి సూచనలు మేరకు పనిచేయాలని, అంతేకాకుండా పనిగట్టుకుని పార్టీపై దుష్ప్రచారం చేస్తూ పత్రికలకెక్కితే ఊరుకునేది లేదని అన్నారు. అయితే పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గజ్వేల్ నుండి చక్కటి ఫలితాలు రాగా, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నియోజకవర్గ ఇన్చార్జి సూచించిన వారికే నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్లు వివరించారు.