ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
పంట నష్టపరిహారంగా ఎకరాకు ₹40 వేలు చెల్లించాలి
బీ ఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి
సిద్దిపేట టైమ్స్ అక్కన్నపేట:
అక్కన్నపేట మండలం పెద్దతండాలో ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మొంత తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులను ఆదుకోలేదని బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి విమర్శించారు. హుస్నాబాద్ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదై వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు పూర్తిగా నష్టపోయాయని తెలిపారు. “రైతులకు పెట్టుబడులు వృథా అయ్యాయి. ప్రభుత్వం మాట తప్పకుండా, ప్రతి ఎకరాకు ₹40,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టంపై సర్వే నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసినా, సర్వే సరిగ్గా జరగలేదని ఆయన మండిపడ్డారు. “వర్షం పడిన నాలుగు ఐదు రోజుల తర్వాత అధికారులు వెళ్లడం వల్ల పొలాల్లో నీరు నిలిచి పంటలు పూర్తిగా పాడయ్యాయి. రైతుల సమస్యను ప్రభుత్వం తేలికగా తీసుకుంది” అని ఆయన అన్నారు. “రైతుల పట్ల నిజమైన ప్రేమ ఉంటే, ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది” అని అయిలేని మల్లికార్జున రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుగోలోతు రాజు నాయక్, సకృ నాయక్, బొడ్డు రాజు కుమార్, భీమా నాయక్, రాంచంద్రర్ నాయక్, దేవేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.





