భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి… తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
వరిపంట నష్టానికి ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి…ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రైతాంగాన్ని రక్షించాలి
వాగులో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ఇటీవల హుస్నాబాద్ నియోజకవర్గంలో తుఫాన్ మరియు భారీ వర్షం పడి వరి మరియు మొక్కజొన్న పత్తి వంటి పంటలు చేతికి రాక నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం సతీష్ కుమార్ పంట నష్టపోయిన ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక ఎకరానికి సుమారు రూ. 25 వేలకు పైగా ఖర్చు అవుతుంది కాబట్టి ప్రభుత్వం పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి కనీసం 25 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పోతారం ఎస్ కు చెందిన తారవ్వ వడ్లు ఆరబోసిన క్రమంలో భారీ వర్షానికి కొట్టుకుపోయి డ్రైనేజీలో పడడం, అందులో నుండి ఆమె డబ్బాతో వడ్లను ఎత్తిపోయడం కలచి వేసిందని ఆమెకు మరుసటి రోజే వడ్లను కాంటావేసి ఆమె ఖాతాలో డబ్బులు జమ చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈమె లాంటి పరిస్థితి నియోజకవర్గంలో చాలామంది అనుభవించారని ఐకెపి సెంటర్లలో గాని బండలపై గాని మైదాన ప్రాంతాల్లో గానీ ఆరబోస్తే వర్షానికి కొట్టుకుపోయి తడిసి ముద్దయి అనేకమంది రైతులు నష్టపోయారని వారిని కూడా ఈ విధంగానే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయిన కల్పన, ప్రణయ్ దంపతులు మల్లంపల్లి వద్ద వాగులో కొట్టుకుపోయిన రామకృష్ణ కొత్తపెళ్లి వద్ద మరొక యువకుడు వాగు దాటుతున్న క్రమంలో తమ ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని వీరికి తక్షణ సహాయంగా ఈ ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా తక్షణమే చెల్లించాలని అన్నారు. అలాగే ఈ మూడు కుటుంబాలలో ఒక్కొక్కరికి చొప్పున ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని కూడా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.





