తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి..
కొనుగోళ్ల లో ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే రైతులు నష్టపోతున్నారు
బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో తడిసిపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం పార్టీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్‌లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతుల సమస్యలను తెలుసుకున్నారు.
బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ —“కొనుగోలు కేంద్రంలో దాదాపు 10 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసి పాడయింది. రైతులు అనేక పెట్టుబడులు పెట్టి ఆరు నెలల కష్టాన్ని ధారపోశారు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ శ్రమ అంతా నీటిపాలైంది. ధాన్యానికి తేమ శాతం ఉన్నప్పటికీ కొనుగోళ్లు నిలిచిపోవడం బాధాకరం” అన్నారు. “ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేస్తోంది కానీ ఆచరణలో మాత్రం రైతులు నష్టపోతున్నారు. రోజులు తరబడి కొనుగోలు కేంద్రాల్లో రైతులు వేచి చూస్తున్నారు. అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.
బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే పలుమార్లు అధికారులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ, కొనుగోళ్లు వేగం దక్కలేదని మల్లికార్జున రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. “ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం ప్రతి గింజను కొనుగోలు చేయాలి” అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎం.ఏ. అన్వర్ పాషా, లక్ష్మణ నాయక్, మేకల వికాస్ యాదవ్, మరియు రైతులు పాల్గొన్నారు.





