సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ పాఠశాల మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో హుస్నాబాద్ మండల జట్లు ప్రతిభ కనబరిచి రన్నరప్ స్థానాలను సాధించాయి. 17 సంవత్సరాల బాలుర విభాగంలో హుస్నాబాద్ మండల జట్టు దుబ్బాక మండల జట్టుతో ఉత్కంఠభరితంగా పోరాడి ద్వితీయ స్థానం పొందింది. అలాగే 14 సంవత్సరాల బాలికల విభాగంలో హుస్నాబాద్ బాలికల జట్టు కుకునూరుపల్లి బాలికల జట్టుతో ఫైనల్లో తలపడి గట్టి పోరాటం చేసి రన్నరప్ స్థానం దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్‌ల అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఘారాగోతం రెడ్డి విజేతలు, రన్నరప్ జట్లకు బహుమతులను ప్రదానం చేశారు. హుస్నాబాద్ జట్లు విజయం సాధించినందుకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడేమ్ లింగమూర్తి, మండల విద్యాధికారి బండారి మనీలా, హుస్నాబాద్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ కె. వాసుదేవ రెడ్డి, కబడ్డీ కోచ్ కృష్ణ తదితరులు క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జిఎఫ్ కార్యదర్శి సౌందర్య, సీనియర్ పీడీలు జి. రాజమౌళి, హరికృష్ణ, హుస్నాబాద్ మండల స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఆర్. శ్రీనివాస్, కోచ్-మేనేజర్లు కళావతి, స్వప్న, అజయ్, సంతోష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.






