హుస్నాబాద్ లో ఘనంగా తీజ్ ఉత్సవాలు
ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బంజారా భవన్ లో తీజ్ ఉత్సవాలు ఘనంగా, సాంప్రదాయ వైభవంతో జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై, బంజారా సోదర సోదరీమణులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.
మొదటగా సేవలాల్ మహరాజ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, బంజారా మహిళలు సంప్రదాయంగా మంత్రి తలపై గోధుమల మొలకల బుట్టను ఉంచారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారా మహిళలతో కలిసి నృత్యం చేస్తూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… “బంజారా సోదర సోదరీమణులందరికీ రాం రాం. తీజ్ పండుగ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మన గిరిజన సంప్రదాయాలకు, విశ్వాసాలకు ప్రతీకంగా, తొమ్మిది రోజుల పాటు గోధుమల మొలకలతో జరుపుకునే ఈ తీజ్ ఉత్సవం, సమాజంలో సర్వేజన సుఖినోభవ భావనకు ప్రతీక” అని పేర్కొన్నారు.
అలాగే “తెలంగాణలో పాడి పంటలు బాగా పండాలి, మంచి వర్షాలు పడాలి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని సేవలాల్ మహరాజ్, మేరీమా యాడి దీవెనలు కలగాలని కోరుకున్నారు.”
“ప్రభుత్వం ఎల్లప్పుడూ బంజారాల అభివృద్ధికి సహకరిస్తుంది. 1978లో ఇందిరాగాంధీ ఎస్టీ హోదాను కల్పించినప్పటి నుంచి గిరిజనుల అభ్యున్నతికి అనేక పథకాలు అమలవుతున్నాయి.” ఆర్థికంగా బలమైన వారు వెనుకబడిన కుటుంబాలకు చేయూతనివ్వాలి. విద్య, ఆర్థిక వనరులు ఉన్నవారు పేదలకు అండగా నిలవాలి.”
తన శాసన సభ్యుని పదవికి ముందే బంజారా సంఘం భవన నిర్మాణానికి నిధులు సమకూర్చిన విషయాన్ని గుర్తుచేసుకున్న మంత్రి, “ఈ భవనం పూర్తి చేసే బాధ్యత నాది. కొంతమంది దీన్ని రాజకీయంగా మలచి విమర్శలు చేస్తుండటం విచారకరం. కానీ సేవలాల్ మహరాజ్ ఆశీస్సులతో మీరు కోరిన ప్రతీ మంచి పనిని పూర్తి చేస్తా” అని హామీ ఇచ్చారు.
తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన బంజారా సంఘానికి మంత్రి అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.





