“ప్రభుత్వ పాఠశాలల్లో చదవండి – సైకిల్ బహుమతిగా పొందండి”
నేను, పొన్నం కలిసి నియోజకవర్గాన్ని అద్బుతంగా తీర్చిదిద్దుతాం
సైనిక్ స్కూల్, నవోదయ స్కూల్ లను ఏర్పాటు చేస్తాం
హుస్నాబాద్‌లో “మోదీ గిఫ్ట్” సైకిళ్ల పంపిణీ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, జూలై 26:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఒక విశేష కార్యక్రమం నిర్వహించారు. “మోదీ గిఫ్ట్” పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. వందలాది మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేసిన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలల్లో చదవండి – సైకిల్ బహుమతిగా పొందండి” అని హామీ ఇచ్చారు. ఎంపీగా కొనసాగినంత కాలం ప్రతి సంవత్సరం టెన్త్ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందిస్తానని తెలిపారు. ఈ సైకిళ్లు ప్రధాని నరేంద్రమోదీ గారి స్పూర్తితో ఇచ్చిన గిఫ్ట్ అని తెలిపారు.
విద్యా అభివృద్ధికి పెద్ద పీట
బండి సంజయ్ మరింతగా వివరిస్తూ, హుస్నాబాద్ నియోజకవర్గంలో నవోదయ స్కూల్‌ను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని, సైనిక్ స్కూల్ స్థాపన దిశగా కూడా కృషి జరుగుతోందన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్లు, మౌలిక వసతుల అభివృద్ధి, నర్సరీ నుండి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులకు మోదీ కిట్స్ (బ్యాగ్, నోట్ బుక్స్, పెన్నులు, స్టీల్ బాటిల్స్) వంటి పథకాలు త్వరలో అమలులోకి వస్తాయన్నారు.
విద్యార్థులకు స్ఫూర్తి చేకూర్చిన కలెక్టర్‌లు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఈవో, ఇతర అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ, “కష్టపడి చదవండి – మీ జీవిత లక్ష్యాలను సాధించండి. కలెక్టర్, ఎస్పీ స్థాయికి ఎదగండి” అంటూ విద్యార్థులకు సూచనలు చేశారు.
సామాజిక బాధ్యతగా విద్య
సైకిల్ పంపిణీ వెనుక ఉన్న కథను గుర్తు చేస్తూ, ఓ పేద విద్యార్థికి స్కూల్‌కి వెళ్లేందుకు సైకిల్ లేనందున చదువు మానేయాల్సి వచ్చిందని, అదే తనకు ఈ పథకానికి ప్రేరణగా మారిందన్నారు. “ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తొలి ఆస్తి సైకిల్. అది నేనే మీకు అందజేస్తున్నా” అన్నారు.
కార్గిల్ దినోత్సవం సందర్భంగా
కార్గిల్ విజయ దినోత్సవాన్ని గుర్తు చేసిన బండి సంజయ్, దేశ భద్రతకు ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకున్నారు. వాజ్‌పేయి హయాంలో మొదలైన ధైర్యవంతమైన చర్యలు, ఇప్పుడు మోదీ నేతృత్వంలో మరింత బలంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
పిల్లలపై తల్లిదండ్రులకు సూచన – కలెక్టర్ హైమావతి
జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ, “పిల్లలు తెల్ల పేపర్‌లాంటివారు. వారు నేర్చుకునే దిశను పెద్దలు నిర్ణయించాలి. వారిని ఉన్నత లక్ష్యాల వైపు దారి తీస్తూ, మానవీయ విలువలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలి” అని అన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల జీవితాల్లో స్ఫూర్తిదాయకమైన మలుపుగా మారుతుందని, బడి మేనిఫెస్టోలో భాగంగా మరిన్ని సంక్షేమ పథకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రగతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అధికారులు తెలియజేశారు.