ఏపీ ఈసెట్ ఫలితాల్లో సత్తచాటిన విద్యార్థులు..
– వీరారెడ్డి పల్లి గ్రామంలో నెలకొన్న పండుగ వాతావరణం..
– ఆనందంలో విద్యార్థినిలు, తల్లిదండ్రులు, గ్రామస్తులు
సిద్దిపేట అక్బరుపేట/భూంపల్లి
ఏపీ ఈసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. గురువారం విడుదలైన ఈ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో చక్కటి ర్యాంకులు సాధించారు. తమ లక్ష్యాలకు తగిన ఇంజినీరింగ్ విభాగంలో చేరి కలలను సాకారం చేసుకుంటామని పేర్కొన్నారు. ఏపీ ఈ సెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈసీఈ విభాగం మొదటి, రెండవ ర్యాంకుల లో ప్రభంజనం సృష్టించిన తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా వీరారెడ్డి పల్లి గ్రామానికి చెందిన విద్యార్థినిలు కట్లే రేవతి, పంజ నవ్య లు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు వారికి ఘనంగా శాలువాతో అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థినిలు కట్లే రేవతి, మాట్లాడుతూ.. నాన్న కట్లే యాదగిరి వ్యవసాయం, అమ్మ కవిత బీడీ కార్మికురాలు రాత్రి పగలు కష్టపడి నన్ను చదివించడం పట్ల ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. పంజా నవ్య మాట్లాడుతూ, నాన్న పంజ నర్సింలు, అమ్మ చెన్నవ్వ ఎంతో కష్టపడి నాన్న కూలి పని చేసుకుంటూ నన్ను చదివిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రెడ్డిపల్లి చిన్న నరసింహారెడ్డి, చాట్లపల్లి బాల గౌడ్, బాల మల్లేష్ గౌడ్, వంజరి సత్యనారాయణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






