పోలీస్ విధులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన
హుస్నాబాద్, కోహెడ పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ / కోహెడ:

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే కార్యక్రమాల భాగంగా హుస్నాబాద్, కోహెడ పోలీస్ స్టేషన్లలో బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యాసంస్థల నుండి సుమారు 130 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ వ్యవస్థ, కేసులు నమోదు ప్రక్రియ, నేరస్తులను పట్టుకునే విధానం, ప్రజల ప్రాణమానం, ధనరక్షణ కోసం పోలీసులు తీసుకునే చర్యలు, మహిళలు – పిల్లల రక్షణకు ఉన్న చట్టాలు, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత, గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.
అలాగే సైబర్ నేరాలు, డయల్ 100 సేవలు, బ్లూ కోర్స్, పెట్రోల్ కార్ వ్యవస్థలు, పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాల పనితీరు, సీసీ కెమెరా ఫంక్షనింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థ, పోలీసు విహెచ్ఎఫ్ సెట్ ఉపయోగం, సీఈఆర్ ద్వారా ఫోన్ రికవరీ వంటి ఆధునిక సాంకేతికతలపై విద్యార్థులకు వివరించారు. పోలీసులు ప్రజల సేవలో అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఈ తరహా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు విద్యార్థుల్లో పోలీస్ శాఖ పట్ల అవగాహన, విశ్వాసాన్ని పెంపొందిస్తాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు లక్ష్మారెడ్డి, అభిలాష్, మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొని విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. విద్యార్థులు పోలీస్ విధుల పట్ల ఆసక్తి కనబరిచారు.





