ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు.. సీఐ కొండ్ర శ్రీనివాస్
సేఫ్టీ కోసం ప్రతి దుకాణం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి…
దుకాణాల ముందు వాహనాల నిలిపివేత నిషేధం..

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్,:
హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఫుట్పాత్ ఆక్రమణలు, దుకాణాల ముందు వాహనాల అడ్డదిడ్డంగా నిలిపివేతలను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ కొండ్ర శ్రీనివాస్, ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి వ్యాపారులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి పలు సూచనలు చేశారు.
గురువారం వ్యాపారులతో సమావేశంలో సీఐ కొండ్ర శ్రీను మాట్లాడుతూ—దుకాణాల ముందు ఇష్టానుసారంగా వాహనాలు నిలపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. వ్యాపారస్తులు తమ దుకాణాల పరిధిని మించి ఫుట్‌పాత్ ఆక్రమించకుండా చూడాలని, రహదారిపై సామాను, అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులు ఉంచి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు.
సీసీ కెమెరాలు తప్పనిసరి
పట్టణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి దుకాణం వద్ద కనీసం రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అందులో ఒక కెమెరా మెయిన్ రోడ్డును స్పష్టంగా చూపేలా ఉండాలని సీఐ తెలిపారు. ప్రజల భద్రత, దుకాణాల రక్షణ కోసం సీసీ కెమెరాలు అత్యంత ఉపయోగకరమని అన్నారు.
ట్రాఫిక్ జామ్ నివారణ చర్యలు
అంబేద్కర్ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తాలలో తరచూ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేతను నియంత్రించాలన్న అంశంపై ఆర్టీసీ డిఎంతో చర్చించినట్టు సీఐ వెల్లడించారు.
నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పలువురు వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇవ్వగా, రానున్న రోజుల్లో కూడా ఈ డ్రైవులు కొనసాగుతాయని తెలిపారు. ఫుట్‌పాత్ ఆక్రమణలు, రోడ్డుపై వ్యాపారం, ట్రాఫిక్‌ను అడ్డుకునే చర్యలు కొనసాగితే చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.





