దళిత విద్యార్థి వివేక్ మృతి పై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ
బాధ్యులపై కఠిన చర్యలు… చైర్మన్ బక్కి వెంకటయ్య

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ నెల 7 వ తేదీన పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి వివేక్ ఘటన పై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో వంటగదిని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. విద్యార్థి వివేక్ మృతి చాలా బాధాకరమని, విద్యార్థి మృతి పై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపి, కలెక్టర్ ను ఆదేశించడం జరిగిందన్నారు. ఎంక్వైరీ ఆఫీసర్ గా ఈడిఎస్సి కార్పొరేషన్ విజయ్ భాస్కర్ ను నియమిస్తామని కలెక్టర్ చెప్పారని వెల్లడించారు. విద్యార్థి మృతి పై హుస్నాబాద్ ఏసిపి ఇచ్చే రిపోర్ట్, పోస్టుమార్టం రిపోర్ట్, ఎంక్వయిరీ ఆఫీసర్ విజయభాస్కర్ ఇచ్చే రిపోర్ట్ ల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. 12 మంది సహచర విద్యార్థులు, ఉపాధ్యాయున్ని కూడా విచారణ చేశామన్నారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ ఎలుక దేవయ్య, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆరె కిశోర్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక ఆంజనేయులు, మీడియా సెల్ ఇంచార్జ్ జాల శ్రీనివాస్, అక్కన్నపేట మండలం నాయకులు గిరిమల్ల గిరి ప్రసాద్ మాషం కొమురయ్య, సుంకే రమేష్, గుమ్మడి సాయి శ్రీరామ్ తదితర కుల బంధువులు పాల్గొన్నారు.





