హుస్నాబాద్‌లో శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం
జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కే. లింగమూర్తి హాజరు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో శాతవాహన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల మొదటి సంవత్సరం తరగతులను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కె. హైమావతి హాజరయ్యారు.
రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా మాట్లాడుతూ, హుస్నాబాద్ నాలుగు జిల్లాల మధ్య ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నాలుగు కోర్సులతో ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించటం ఆనందదాయకమని తెలిపారు. కళాశాల స్థాపనకు తాను, వైస్ చాన్సలర్, కలెక్టర్ కృషి చేశామని చెప్పారు. రాబోయే 10 సంవత్సరాల్లో అధునాతన సౌకర్యాలతో కళాశాలను నిర్మించి, మారుమూల ప్రాంతాల విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు ఎల్లప్పుడూ సహకరిస్తానని హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, ఈ ప్రాంతం ఇంజనీరింగ్ కళాశాల స్థాపనకు అర్హత కలిగినదని, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా స్థానిక యువతకు పెద్ద అవకాశం లభించిందని అన్నారు. మంచి ఫ్యాకల్టీతో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి, త్వరలో శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని తెలిపారు.
వైస్ చాన్సలర్ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ, హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం మంత్రి పొన్నం ప్రభాకర్ దూరదృష్టి ఫలితమని, ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని సౌకర్యాలు సమకూర్చి తెలంగాణలో నంబర్ 1 కళాశాలగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తామని చెప్పారు.
గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి మాట్లాడుతూ, 35 ఎకరాల భూమిలో కళాశాల నిర్మాణం జరిగి, ఒకటిన్నర నుంచి రెండేళ్లలో పర్మనెంట్ క్యాంపస్ సిద్ధం అవుతుందని తెలిపారు. మంత్రి చొరవతో ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల రావడం అభివృద్ధి పథంలో కీలకమని అన్నారు.
కార్యక్రమం చివరగా కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ప్రముఖులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ రవికుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కే. లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఆర్డీవో రామ్మూర్తి, ఏసీపీ సదానందం తదితరులు పాల్గొన్నారు.





