ఆకలి పేగుల ఆర్తనాదం సాయిబాబా
హుస్నాబాద్ లో ప్రొఫెసర్ కు ఘన నివాళి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
అణగారిన వర్గాల బాధలు తీర్చేందుకు తన జీవితాన్ని ఫణంగా పెట్టిన మహానుభావుడు సాయిబాబా అని దళిత, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న జి.ఎన్ సాయిబాబా అకాల మరణానికి చింతిస్తూ హుస్నాబాద్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం నాడు నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సాయిబాబా మరణం దేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ తీరని లోటు అని అన్నారు. ఆదివాసి హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, పేదరిక నిర్మూలన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం ప్రశ్నించినందుకు బిజెపి ప్రభుత్వం ఆయనను అక్రమంగా అరెస్టు చేయించి 9 సంవత్సరాల పాటు జైలులో నిర్బంధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 9 ఏళ్ల అనంతరం నిరపరాది అంటూ కోర్టు తీర్పునిస్తూ విడుదల చేసిందని తెలిపారు. 90 శాతం వికలాంగుడైన సాయిబాబాను అమానుషంగా జైలు పాలు చేయడం వల్లనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని అభిప్రాయపడ్డారు. ఆయన మరణం ముమ్మాటికి బిజెపి ప్రభుత్వం చేసిన హత్యేనని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముక్కెర సంపత్ కుమార్, మేకల వీరన్న యాదవ్, కొయ్యడ కొమురయ్య, గాదెపాక రవీందర్, మారపల్లి సుధాకర్, బత్తుల చంద్రమౌళి, గడిపే మల్లేశ్, అయిలేని సంజీవరెడ్డి, నాంపల్లి సమ్మయ్య, కాదాస్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.