హుస్నాబాద్‌లో రేపే సద్దుల బతుకమ్మ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణ ప్రజలకు ముఖ్య సమాచారం. జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సెప్టెంబర్ 29, 2025 సోమవారం రోజున సద్దుల పెద్ద బతుకమ్మ పండుగను హుస్నాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ పురోహితుల నిర్ణయం మేరకు పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ప్రధాన కార్యక్రమం ఎల్లమ్మ చెరువు కట్టమీద సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ… బతుకమ్మ ఆడుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, మునిసిపల్ సిబ్బంది, పోలీసులు కలసి సమకూర్చారని తెలిపారు. చెరువులో నీటి మట్టం ఎక్కువగా ఉన్నందువల్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. “బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక. అందరూ ఐక్యంగా పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకోవాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు బోలిశెట్టి శివయ్య, చిత్తారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.





