సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్డులో హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టైర్ పేలిన ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. గాయాలైన మహిళలను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో హుస్నాబాద్ నుండి కరీంనగర్ కు వెళుతున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది. బస్సు టైరు పేలి పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు, చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే నాగారం రోడ్డులో ఆర్టీసీ బస్సు టైర్ పేలిన సమయంలో పక్కకు వేరే వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెండు టైర్లలో ఒకటి భారీ శబ్దం చేస్తూ పేలిపోగా ఆ పేలుడు దాటికి టైరు పైన ఉన్న రేకు ఒక్కసారిగా పైకి లేచి సీట్లో కూర్చొని ఉన్న పెద్దపల్లి జిల్లా సబ్బితం కు చెందిన కళ్యాణి, ప్రవళిక, అక్కన్నపేట మండలం కుందన వానపల్లి గ్రామపంచాయతీ మబ్బుకుంట తండా కు చెందిన శశి ప్రియ తో సహా ముగ్గురు మహిళల కాళ్లకు గాయాలై రక్తస్రావం జరిగింది. కాగా పెద్దపల్లి కి చెందిన ఇద్దరు మహిళల కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనం లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన కళ్యాణి, ప్రవళిక ఇద్దరు మహిళలు హుస్నాబాద్ లో జరిగిన వేస్టేజ్ మీటింగ్ కు వచ్చారు. శశిప్రియ మబ్బుకుంట తండా నుండి కరీంనగర్ కు వెళ్తున్నది. ఆర్టీసీ బస్సు నిర్వహణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే ఆర్టీసీ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదం జరిగిన విషయంపై ఆరా తీశారు. గాయపడ్డ మహిళలకు మెరుగైన చికిత్సను అందించాలని అధికారులను ఆదేశించారు.
