వచ్చే జనవరి 26 లోపు హుస్నాబాద్ పట్టణానికి రింగురోడ్డు
ప్రభుత్వ హాస్పిటల్ వరకే హుస్నాబాద్ – కొత్తపల్లి ఫోర్ లైన్ రోడ్డు
హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
ఐ లవ్ హుస్నాబాద్, గాంధీ విగ్రహవిష్కరణ చేసిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :

మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడిచి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపాలిటీ సహకారంతో గాంధీ జంక్షన్ సుందరీకరణలో భాగంగా నూతనంగా గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని, రైతు బజార్ వద్ద ఏర్పాటుచేసిన “ఐ లవ్ హుస్నాబాద్” జంక్షన్ ను శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ… గతంలో బొప్ప రాజు లక్ష్మీ కాంతారావు 1959 లో ఈ ప్రాంతంలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, పట్టణంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా మున్సిపాలిటీ సహకారంతో గాంధీ జంక్షన్ సుందరీకరణ చేయడం జరిగిందన్నారు. ఈ చౌరస్తాలో గాంధీ విగ్రహాన్ని చూడగానే ఆయన స్ఫూర్తి పొందాలన్నారు. హుస్నాబాద్ ను విద్యా, వైద్యం, వ్యవసాయం, ఉపాధి తోపాటు అనేక రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని దీనికి సంబంధించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడి నుండి కాగితం పోగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు నన్ను తమ్ముడు లాగా భావించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని, రైతులకు రైతు భరోసా, భూమిలేని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని, అసంపూర్తిగా ఉన్న డబ్బులు బెడ్ రూమ్ లకు నిధులు కేటాయించి పూర్తి చేస్తామన్నారు.
హుస్నాబాద్ పట్టణ ప్రజల విజ్ఞప్తి మేరకు కొత్తపల్లి హుస్నాబాద్ నాలుగు లైన్ల రోడ్డు గాంధీ వరకు వస్తే 200 కొరకు ఇండ్లు పోతున్నాయని, ఎక్కువ మంది నష్టపోకుండా దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ వరకు మాత్రమే వెడల్పు చేస్తున్నామని తెలియజేశారు. అలాగే వచ్చే సంవత్సరం జనవరి 26 లోపు హుస్నాబాద్ పట్టణానికి రింగురోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా హుస్నాబాద్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
