తుఫాన్ బాధిత మహిళా రైతు కేడిక తారదేవికి ఊరట!.. ధాన్యం కొనుగోలు పూర్తి…267 బస్తాల వడ్లకు ₹2.55 లక్షలు జమ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:


హుస్నాబాద్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన మహిళా రైతు కేడిక తారదేవి ఇటీవల వరి పంటను మార్కెట్ యార్డుకు అమ్మకానికి తీసుకువెళ్లి ఎదుర్కొన్న కష్టాల తరువాత, ఆమె కుటుంబానికి చివరకు ఊరట గా ఆమె ధాన్యం అమ్మకాల రుసుము ఖాతాలో జమ కావడం జరిగింది. తారదేవి మొత్తం 267 బస్తాల వడ్లు, అంటే 106.80 క్వింటాళ్లు మార్కెట్‌లో విక్రయించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ప్రతి క్వింటాకు ₹2,389/- రేటు కల్పించగా, మొత్తం ₹2,55,145/- (రెండు లక్షల యాభై ఐదు వేల నూట నలభై ఐదు రూపాయలు) ఆమె భర్త కేడిక రవీందర్ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బంక చందు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను బంక చందు స్వయంగా పర్యవేక్షించారు. తారదేవి కుటుంబానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర మేరకు చెల్లింపులు సమయానుకూలంగా జరగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం తడవడంతో, తారదేవి తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. ఆమె పరిస్థితి వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తక్షణమే స్పందించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ₹10,000 ఆర్థిక సహాయం అందజేయగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా మానవతా దృక్పథంతో స్పందించి ₹50,000 ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు మొత్తం భర్త కేడిక రవీందర్ ఖాతాలో జమ కావడంతో మహిళ రైతు కుటుంబానికి ఊరటనిచ్చింది.





