13 మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన హుస్నాబాద్ పోలీసులు
ఏసిపి సదానందం ఆధ్వర్యంలో బాధితులకు అప్పగింత

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో ఇటీవలి రోజుల్లో పోయిన, దొంగలించబడిన మొబైల్ ఫోన్లను పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రికవరీ చేసి హుస్నాబాద్ ఏసిపి కార్యాలయంలో బుధవారం రోజు నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 13 మొబైల్ ఫోన్లు, విలువ సుమారు రూ. 2,20,000 రూపాయల మేర, బాధితులకు తిరిగి ఏసిపి ఆధ్వర్యంలో అప్పగించారు.
పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, CEIR (Central Equipment Identity Register) టెక్నాలజీ ద్వారా ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసిపి సదానందం మాట్లాడుతూ, “సెల్ ఫోన్ పోయినప్పుడు లేదా దొంగలించబడినప్పుడు, CEIR వెబ్‌సైట్‌లో ఫోన్ వివరాలు నమోదు చేయడం ద్వారా దాన్ని తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి,” అని పేర్కొన్నారు.
అలాగే, ఫోన్ పోయిన వారందరూ వెంటనే తమ ప్రాంత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, తద్వారా దర్యాప్తు వేగంగా సాగుతుందని సూచించారు. సెల్‌ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయిందని, దాని కోల్పోవడం వల్ల కలిగే బాధను అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం CEIR వంటి ఆధునిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.
ఫోన్లు తిరిగి అందుకున్న బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ, “పోయిన ఫోన్లు మళ్లీ దొరకవని అనుకున్నాం, కానీ పోలీస్ శాఖ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి వాటిని రికవరీ చేయడం చాలా ఆనందంగా ఉంది,” అని పేర్కొన్నారు. వారు హుస్నాబాద్ డివిజన్ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.