సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణంలోని 17వ వార్డులో మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు శనివారం అత్యంత వైభవంగా ముగిశాయి. వార్డులోని శివాలయం వీధిలో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో స్థానిక మహిళలు భారీ సంఖ్యలో, ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా మహిళలు రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. గొబ్బెమ్మలు, హరిదాసులు, రథం ముగ్గులతో శివాలయం వీధి కోలాహలంగా మారింది. తమలోని సృజనాత్మకతను వెలికితీస్తూ మహిళలు వేసిన ముగ్గులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీల్లో పాల్గొన్న మహిళలందరినీ ప్రోత్సహిస్తూ, వారికి మాజీ కౌన్సిలర్ వల్లపు రాజు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి పోటీలు మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే కాకుండా, మన సంప్రదాయాలను తర్వాతి తరానికి అందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొలిశెట్టి శివయ్య, చిత్తారి రవీందర్, చిత్తారి పద్మలతో పాటు జేఏసీ నాయకులు వీరన్న యాదవ్, కాంగ్రెస్ యూత్ నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు. పండుగ వేళ వార్డులో ఇటువంటి పోటీలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.



