సీఎం సభ నేపథ్యంలో నాయకుల ముందస్తు అరెస్టులు
సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హుస్నాబాద్ బహిరంగ సభ కు రానున్న నేపథ్యంలో పోలీసు శాఖ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. సీఎం పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగే అవకాశముందని భావించి హుస్నాబాద్ మండలానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను బుధవారం తెల్లవారుజామునే ముందస్తుగా అరెస్టు చేశారు. సీఎం పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందన్న సమాచారం మేరకు పోలీసు అధికారులు పలువురు నాయకులకు ముందుగానే నోటీసులు జారీ చేశారు. అనంతరం వారిని హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి, మాజీ పట్టణ బీజేపీ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, బీఆర్ఎస్ నాయకులు, ఏబీవీపీ నాయకులు సహా పలు ప్రతిపక్ష నాయకులు ఉన్నట్లు తెలిసింది. బహిరంగ సభ వేదిక, పట్టణ ప్రధాన రోడ్లపై పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోహరించారు. వాహనాల తనిఖీలు, ర్యాలీలపై నిఘా పటిష్టంగా ఏర్పాటు చేశారు. సమావేశాలపై కట్టుదిట్టమైన పరిమితులు అమలులో ఉన్నాయి. ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని ప్రతిపక్షాలు మండి పడుతుండగా, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ చర్యలు తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సీఎం పర్యటనతో హుస్నాబాద్ పట్టణం అంతా పోలీసు నిఘా వ్యవస్థలో ఉంది.







