లంబాడీల ఆత్మగౌరవ మహాసమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 5 :

లంబాడీల ఆత్మగౌరవం కోసం హుస్నాబాద్‌లో భారీ స్థాయిలో నిర్వహించనున్న “లంబాడీల మహా సమ్మేళనం – చలో హుస్నాబాద్” పోస్టర్లను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన నాయకులు ఆవిష్కరించారు. ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో కొంతమంది నాయకులు దాఖలు చేసిన పిటీషన్‌కు వ్యతిరేకంగా గిరిజన సమాజం ఐక్యంగా స్పందించింది. ఆ పిటీషన్‌ను బేషరతుగా వెనక్కు తీసుకోవాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, ఈ నెల 8వ తేదీ బుధవారం హుస్నాబాద్‌లోని ఏనె అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా తిరుమల గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు గిరిజన సంఘాలు వెల్లడించాయి. అనంతరం తిరుమల గార్డెన్‌లో లంబాడీల మహాసమ్మేళనం జరుగనుంది. రాజకీయ పార్టీలకతీతంగా ప్రతి గిరిజన తండా నుండి పెద్ద ఎత్తున గిరిజనులు ఈ ర్యాలీ, సభలకు హాజరై జాతి ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎస్టీ జాబితా నుండి లంబాడీల తొలగింపుపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించాలనీ వారు డిమాండ్ చేశారు. గిరిజన నాయకులు మాట్లాడుతూ, లంబాడీ సమాజం గౌరవం, గుర్తింపు కాపాడటానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని మరియు ఈ మహాసమ్మేళనం ద్వారా గిరిజనుల ఐక్యతకు బలమిచ్చే సంకేతం ఇవ్వాలని తెలిపారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగులు, నాయకులు బానోతు కిసన్ నాయక్, లావుడ్య బిక్షపతి, లావుడ్య రవి, గుగులోతు శంకర్ నాయక్, గుగులోతు హరియా నాయక్, భూక్య శ్రీనివాస్ నాయక్, గుగులోతు భీమ సాయబ్, భూక్య సరోజన, గుగులోతు రాజు నాయక్, మాలోత్ రామచందర్ నాయక్, గుగులోతు శివరాజ్ నాయక్, భూక్య వీరన్న నాయక్, ధరావత్ తిరుపతి నాయక్, లకవత్ వెంకటేష్ నాయక్, మూడవ వసంత్ నాయక్, భూక్య మోతిలాల్ నాయక్, లావుడ్య కైలు నాయక్, లావుడ్య భీఖ్య నాయక్, మాలోత్ సత్యం నాయక్, గుగులోతు రవి నాయక్, బానోతు భాస్కర్ నాయక్, గుగులోతు లక్పతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.





