గుర్తు తెలియని వాహనం ఢీకొని హమాలి కార్మికుల మృతి
-హమాలి పని ముగించుకొని నడుచుకుంటూ వెళుతున్న ఐలయ్య.
-అతివేగంగా వెనక నుండి వచ్చి ఢీకొట్టిన కారు.
-సంఘటనా స్థలంలోనే మృతి చెందిన ఐలయ్య.
సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్
గుర్తుతెలియని వాహనం ఢీకొని సంఘటన స్థలంలోనే వ్యక్తి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా
రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి గ్రామ బస్టాండ్( ప్రయాణం ప్రాంగణం) సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, రాయపోల్ పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయపోల్ మండలం వీరానగర్ గ్రామానికి చెందిన జాలిగామ ఐలయ్య(35) వ్యవసాయం, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అంకిరెడ్డిపల్లి గ్రామంలోని హార్డ్వేర్ షాప్ లో సిమెంట్ లారీ లోడ్ ఖాళీ చేయడానికి దినసరి కూలీగా వెళ్లాడు. సిమెంట్ ఖాళీ చేసిన అనంతరం షాపు వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా అజాగ్రత్తగా అతివేగంగా తప్పుడు మార్గంలో నలుపు రంగు కారు వెనకాల నుంచి వచ్చి ఐలయ్యను బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఐలయ్య ఎక్కడికి అక్కడే మృతి చెందాడు. కాగా కారులో ఉన్న వ్యక్తి సంఘటన స్థలంలో కారు ఆపకుండా తప్పించుకొని కారుతో సహ పారిపోవడంతో ఏ వాహనం ఢీ కొట్టిందో తెలియడం లేదు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని సంఘటన స్థలం నుంచి తరలించేది లేదని గజ్వేల్ – చేగుంట రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకున్న రాయపోల్ ఎస్సై రఘుపతి సిబ్బందితో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ధర్నా విరమించేది లేదని గ్రామస్తులు ఆందోళన ఉధృతం చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న తొగుట సిఐ షేక్ లతీఫ్ ప్రమాదానికి కారణమైన కారు యజమాని వివరాల కోసం విచారణ చేపట్టగా వర్గల్ మండలం నెంటూర్ గ్రామానికి చెందిన గౌరయ్యగారి ప్రకాష్ గౌడ్ గా గుర్తించారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేస్తామని బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు ఐలయ్యకు భార్య ఎల్లవ్వ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. హమాలీ పనికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఐలయ్య మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీరు మునీరవుతున్నారు.