వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి
వినాయక మండపాల నిర్వాహకుల సమీక్ష సమావేశంలో ఏసిపి సదానందం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బుధవారం వినాయక మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ వినాయక మండపాలను ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా http://policeportal.tspolice.gov.in లింక్ ద్వారా ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలగని ప్రదేశాలలో మాత్రమే మండపాలు నిర్మించాలని, ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించరాదని అధికారులెచ్చరించారు.
మండపాల వద్ద తగిన భద్రతా చర్యలు, ఫైర్ సేఫ్టీ పరికరాలు (ఇసుక, వాటర్ డ్రంలు) ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ కనెక్షన్లు నాణ్యమైన వైరింగ్తో ఉండాలని, టార్పాలిన్ కవర్లతో భద్రతగా మండపాలను తయారు చేయాలని అధికారులు సూచించారు.
లౌడ్స్పీకర్ల వినియోగంపై సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలని హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే ఉపయోగించాలి. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాల దగ్గర పెద్ద శబ్దం రానీయరాదని పేర్కొన్నారు. భక్తి గీతాలకే పరిమితం కావాలని తెలిపారు.
ముఖ్యంగా మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకూడదని, మద్యం సేవించి మండపాల వద్దకు రాకూడదని సూచించారు. మహిళల పట్ల మర్యాదగా మెలగాలని, వాట్సాప్ ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరిస్తామన్నారు.
ప్రతి మండపానికి వాలంటీర్లను నియమించి భక్తులను క్రమబద్ధీకరించాలని, వివాదాస్పద ప్రదేశాల్లో మండపాలు ఉండరాదని పోలీసులు స్పష్టం చేశారు. గణపతి నిమజ్జనం నిర్ణీత తేదీ లోపల పూర్తి కావాలని నిర్వాహకులకు సూచన ఇచ్చారు.
ఈ సమావేశంలో ఉత్సవ కమిటీల కన్వీనర్లు, మండప నిర్వాహకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.





