దయచేసి మాకు న్యాయం చేయండి సారూ… అంటూ కలెక్టర్ కాళ్లు మొక్కిన మహిళ రైతు
కొట్టుకుపోయిన వడ్లను డ్రైనేజీ నుండి చేతులతో ఎత్తుకుంటూ గుండెలవిసేలా రోదన
తడిసిన ధాన్యానికి న్యాయం చేయాలని.. తన శ్రమ వృథా అయిపోయిందని కన్నీళ్లు
ఇంత కష్టపడి పండించిన ధాన్యం ఇలా నాశనం అయిపోయింది… అంటూ ఆవేదన
హుస్నాబాద్ లో తుఫాన్ దెబ్బకు వడ్లు కొట్టుకుపోయి గుండెలవిసేలా రోదించిన మహిళా రైతు

సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:
మొంథా తుఫాన్ ప్రభావంతో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి, వడ్లు మోరుల్లోకి, డ్రైనేజీల్లోకి కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ దృశ్యం హుస్నాబాద్ పట్టణాన్ని కదిలించింది. వర్షంలో కొట్టుకుపోయిన వడ్లను డ్రైనేజీ నుండి చేతులతో ఎత్తుకుంటూ గుండెలవిసేలా రోదించిన మహిళా రైతు ఆవేదన ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది. తన శ్రమ వృథా అయిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్న ఆమె — “ఇంత కష్టపడి పండించిన ధాన్యం ఇలా నాశనం అయిపోయింది… దయచేసి మాకు న్యాయం చేయండి సార్” అంటూ విన్నవించారు.
జిల్లా కలెక్టర్ హుస్నాబాద్ మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన సమయంలో, ఆ మహిళా రైతు కలెక్టర్ కాళ్లు మొక్కి ఆవేదన వ్యక్తం చేశారు. తమ ధాన్యం పూర్తిగా పాడైందని, ప్రభుత్వమే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకున్నారు. వడ్ల కుప్పలు మట్టిలో మునిగి ఉండగా, రైతులు కుటుంబాలతో కలిసి వర్షంలో తడుస్తూ ధాన్యాన్ని రక్షించే ప్రయత్నం చేశారు. యార్డ్ అంతా చెరువులా మారిపోయింది. కలెక్టర్ బాధిత రైతులను పరామర్శించి, పరిస్థితిని పరిశీలించారు. తడిసిన ధాన్యం విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని, రైతులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. స్థానిక రైతు సంఘాలు ప్రభుత్వం తక్షణం ప్రత్యేక నష్టపరిహారం ప్రకటించాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాయి.







