హుస్నాబాద్ పట్టణంలో వరద ముప్పు నివారణకు శాశ్వత ప్రణాళిక.. మంత్రి పొన్నం ప్రభాకర్
పాదయాత్రగా వ్యాపారులతో మమేకమై ప్రజలకు భరోసా
తడిసిన ధాన్యం సహా మార్కెట్కు వచ్చే అన్ని వడ్లను వేగంగా కొనుగోలు చేయాలని ఆదేశాలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం పర్యటన
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా హుస్నాబాద్ పట్టణంలో పలు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించారు. మల్లె చెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్రగా నడుస్తూ మంత్రి స్థానిక వ్యాపారులతో మాట్లాడారు. వరద నీటితో షాపుల్లోకి నీరు చేరి నష్టాలు వాటిల్లినట్టు షాపు యజమానులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ, “ ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత చర్యలు తీసుకుంటాం” అని భరోసా ఇచ్చారు. కొత్తగా నిర్మించిన నాలా వ్యవస్థ పూర్తయినప్పటికీ, కొన్ని చోట్ల పెండింగ్ పనులు, నీటి ప్రవాహం అడ్డం పడటంతో సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి గుర్తించారు. సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత ఆయన మల్లె చెట్టు చౌరస్తాలో కూరగాయల అమ్మే మహిళలతో ముచ్చటించారు. రైతుల ఇబ్బందులు తెలుసుకుని, కూరగాయల నష్టం వంటి అంశాలపై విచారించారు.
తదుపరి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును మరోసారి సందర్శించి, ఉదయం నుండి ఎంత ధాన్యం కొనుగోలు చేయబడిందీ, ఎన్ని లారీలు లోడ్ చేయబడ్డాయో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తడిసిన ధాన్యం సహా మార్కెట్‌కి వచ్చే ప్రతీ ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేసి, లారీల ద్వారా తరలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. “రైతు శ్రమ వృథా కాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత. తడిసిన ధాన్యం అయినా సరే, రైతు నష్టపోకుండా వెంటనే కొనుగోలు చేయాలి” అని తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో వరద ముప్పు నివారణకు శాశ్వత ప్రణాళిక సిద్ధం చేయాలని, డ్రైనేజీ వ్యవస్థను సమీక్షించి అవసరమైన చోట్ల కొత్త పైప్‌లైన్లు వేయాలని మంత్రి అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆక్కు శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్, మాజీ కౌన్సిలర్ చిత్తారి పద్మ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






