గ్రామాల అభివృద్ధికి నిధులు తెచ్చేది మోదీ ప్రభుత్వం మాత్రమే
పనిచేసిన వారిని గెలిపించండి… గ్రామాల ప్రగతిని వేగవంతం చేయండి
పల్లెల్లో చిచ్చుపెడుతున్న పార్టీలకు మీ ఓటుతో బుద్ధి చెప్పండి
ఓటు వేసే ముందు ఆలోచించండి: బండి సంజయ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సర్పంచ్ ఎన్నికల తొలి దశ పోలింగ్ వేళ, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని గ్రామీణ ఓటర్లను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం కీలక పిలుపునిచ్చారు. పల్లెల అభివృద్ధికి కావాల్సిన నిధులన్నీ మోదీ ప్రభుత్వం అందిస్తోందని, ఇప్పటి వరకు గ్రామాల్లో నిర్మించిన రైతువేదికలు, స్మశాన వాటికలు, పల్లెప్రకృతి వనాలు, వీధిదీపాలు, రోడ్లు, పారిశుధ్య సదుపాయాలు అన్నీ కేంద్రం ఇచ్చిన నిధులతోనే సాధ్యమయ్యాయని వివరించారు. గ్రామాల అభివృద్ధి పేరిట రెండు ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ‘‘గాడిద గుడ్డు’’ కూడా ఇవ్వలేదని, బీఆర్ఎస్ పాలనలో అప్పుల భారం భరించలేక సర్పంచులు ఆత్మహత్య చేసుకునే స్థితి ఏర్పడిందని ఆరోపించారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్రం అందించిన భారీ మౌలిక సదుపాయాల నిధులతో NH563 కరీంనగర్–వరంగల్ హైవే విస్తరణకు రూ.2146 కోట్లు, ఎల్కతుర్తి–సిద్దిపేట రోడ్డుకు రూ.578 కోట్లు, కరీంనగర్–జగిత్యాల రోడ్డుకు రూ.1900 కోట్లు కేటాయించబడినట్లు వెల్లడించారు. అదనంగా CRIF కింద రూ.219 కోట్లతో 150 కిలోమీటర్ల రోడ్లను, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రూ.116 కోట్లతో 32 రోడ్ల నిర్మాణాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఎంపీ లాడ్స్ మరియు సీఎస్సార్ నిధులతో చేపట్టిన సేవా కార్యక్రమాలను కూడా వివరించారు. ప్రభుత్వ పాఠశాలల 20 వేల విద్యార్థులకు బ్రాండెడ్ సైకిళ్లు, రాబోయే సంవత్సరంలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, పిల్లలకు ‘‘మోడీ కిట్’’లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, గ్రామాల్లో బోర్లు, జిల్లా ఆసుపత్రులకు కోట్లు విలువైన మెడికల్ ఎక్విప్‌మెంట్లు, మెడికల్ కాలేజీ హాస్టళ్లకు సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ‘‘గ్రామాల అభివృద్ధికి పనిచేసేది, నిధులు తెచ్చేది మోదీ ప్రభుత్వం మాత్రమే. పల్లెల్లో చిచ్చుపెడుతున్న పార్టీలకు మీ ఓటుతో బుద్ధి చెప్పండి’’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘పనిచేసిన వారిని గెలిపించండి. గ్రామాల ప్రగతిని వేగవంతం చేయండి’’ అని బండి సంజయ్ గ్రామీణ ఓటర్లను కోరారు.





